ముసలోళ్లు మహా ముదుర్లు : కప్ తో సమాధానం చెప్పిన చెన్నై

IPL CSKచెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ లో విజయవంతమైన జట్లలో ఒకటి. ముంబై తర్వాత మూడుసార్లు ట్రోఫీని అందుకున్నది చెన్నై మాత్రమే. ప్రతిసారీ సీజన్ కు ముందు ఆ జట్టుపై వచ్చిన విమర్శలకు… విజయాలతోనే రిప్లై ఇచ్చారు ప్లేయర్స్. ప్లే ఆఫ్ కు చేరడమే గగనమని కొందరు కామెంట్ చేస్తే… ఏకంగా కప్పుతోనే సమాధానం చెప్పారు. టీ 20లంటేనే యంగ్ ప్లేయర్స్ ఆట.

అయితే.. ఆ టీమ్ సగటు వయస్సు 33 సంవత్సరాలు. ఇంటర్నేషనల్ కెరీర్ ముగించిన వాట్సన్, బ్రావో, హర్భజన్, కెరీర్  ఫైనల్ స్టేజ్ లో ఉన్న ధోనీ, రైనా, డుప్లెసిస్ లాంటి ప్లేయర్లతో ఆడుతున్న ముసలోళ్ల టీమ్ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ప్రధాన బ్యాట్స్ మెన్ అనుకున్న వాళ్లు ఫామ్ లో లేకపోవడంతో పాటు పేస్ బౌలింగ్ కూడా బలహీనంగా కనిపించింది. జట్టు సొంత మ్యాచ్ లు చెన్నైలో కాకుండా పూణెలో ఆడాల్సి రావడం ఈ సీజన్ కు ముందు CSKకి పెద్ద షాక్. అయితే ఇవేవీ మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో ఆ జట్టుపై ప్రభావం చూపలేదు. చెన్నై  ఆడిన 9 సీజన్లలో 7 సార్లు ఫైనల్ చేరింది. మూడుసార్లు ఛాంపియన్ గా …. నాలుగు సార్లు రన్నరప్ గా నిలిచింది. 2010, 2011 లో వరుసగా రెండుసార్లు ట్రోఫీ గెల్చుకుంది చెన్నై సూపర్ కింగ్స్.

ఏడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు కప్ గెల్చుకుని కింగ్స్ గా నిలిచింది. ఈ సీజన్ మొత్తంలో హైదరాబాద్, చెన్నై జట్లు నాలుగు సార్లు తలపడగా.. అన్ని సార్లూ చెన్నై జట్టే విజయం సాధించింది. లీగ్ దశలో రెండు సార్లు, ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్ లో ఒకసారి హైదరాబాద్ ను చెన్నై ఓడించింది.  మూడు ఓటములకు ఫైనల్లో అయినా ప్రతీకారం తీర్చుకుంటుందని హైదరాబాద్ ఫ్యాన్స్ భావించినా… అది సాధ్యం కాలేదు.   చెన్నైకి అతి పెద్ద బలం కెప్టెన్ ధోనీనే. ఆటగాళ్లపై అతను పెట్టే నమ్మకం.. వాళ్లలో కల్పించే భరోసానే వేరు. అందుకే ముంబై వదిలేసిన రాయుడు చెన్నై తరపున చెలరేగిపోయాడు. అనామక బౌలర్ చాహర్… బాగా రాణించాడు. 2017 సీజన్ లో రాణించని వాట్సన్… ఈ సీజన్ లో చెన్నై తరపున రెండు సెంచరీలు చేశాడు. ఫైనల్లో  విశ్వరూపమే చూపించాడు. లీగ్ ప్రారంభానికి ముందు సాధారణంగా కనిపించిన జట్టే .. అనూహ్య విజయాలు సాధించి కప్పు ఎగరేసుకుపోయిందంటే అది చెన్నైకి మాత్రమే సాధ్యం. దీంతో ముసలోల్లు మహా ముదుర్లు అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు నెటిజన్లు.

 

 

 

Posted in Uncategorized

Latest Updates