మూసివేత దిశగా గాంధీజీ స్థాపించిన స్కూలు

దేశవ్యాప్తంగా జాతిపిత గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు 93 సంవత్సరాల క్రితం ఆయన ప్రారంభించిన విద్యాజ్యోతి కాంతి విహీనంగా తయారైంది. గాంధీజీ స్వతంత్య్ర పోరాటంలోకి ప్రవేశంచిన తొలినాళ్లలో దేశమంతటా జాతీయ స్కూళ్లు ఏర్పాటయ్యాయి. అహ్మదాబాద్‌లో 1921లో ఆయన ప్రారంభించిన రాష్ట్రీయ పాఠశాల అలాంటివాటిలో ఒకటి. గుజరాత్ విద్యాపీఠ్‌తో పాటే ఏర్పాటు చేసిన ఆ పాఠశాల విద్యార్థుల సంఖ్య, నిధుల సంఖ్య రోజు  రోజుకి తగ్గిపోయింది. 1970 నుంచి 2000 సంవత్సరాల మధ్యకాలంలో విద్యార్థుల సంఖ్య 1000 వరకు ఉండేది. ఇప్పుడు 1 నుంచి 7వ తరగతి వరకు మొత్తమంతా కలిపి 37 మంది మిగిలారు. వారిని వేరే స్కూళ్లలో చేర్చి పాఠశాల మూసివేతకు రంగం సిద్ధం చేశారు. ఈ పాఠశాలకు ఇంకా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. జాతీయ భావాలను ప్రేరేపించేందుకు ఉద్దేశించిన పాఠశాల రాజ్యాంగాన్ని స్వయంగా గాంధీజీ రాశారు. 1939లో ఆయన ఈ పాఠశాల ఆవరణలోనే నిరాహారదీక్షకు దిగారు. ఎందరో మహామహులు చదివిన పాఠశాలగా దీనికి పేరు. ప్రస్తుత గుజరాత్ విద్యాపీఠ్ వైస్ చాన్సలర్ అనామిక్ షా ఒకప్పుడు ఈ పాఠశాల విద్యార్థే. పాఠశాల స్థలం స్థానిక రాజావారు 99 సంవత్సరాల లీజుకు ఇచ్చారు. మరో రెండేళ్లలో అది ముగియనుంది. మొత్తంమీద మహాత్ముని ఆశయాలతో ఏర్పడిన స్కూలు కాలగర్భంలో కలిసిపోనుంది.

Posted in Uncategorized

Latest Updates