మూసీ వరదలకు 110 ఏళ్లు…అదో మహా విషాదం

110 ఏళ్ల క్రితం జరిగిన మహా విషాదం అది… వేలాది మందిని జలసమాధి చేసిన ప్రకృతి విపత్తు… భాగ్యనగర చరిత్రలో అదో మానని గాయం. 1908 సెప్టెంబరు 28న మూసీ వరదలు నగరాన్ని ముంచేత్తాయి. వేలాది మంది జలసమాధి అయ్యారు.

1908 సెప్టెంబరు 26 ఉదయం నుంచే వాతావరణ పరిస్థితిలో మార్పు వచ్చింది. సాయంత్రం 4 గంటల సమయంలో అరగంట పాటు తుంపరగా వర్షం పడింది. ఆ తర్వాత 6.30 దాకా భారీ వర్షం కురిసింది. రాత్రి 9 గంటల సమయంలో మళ్లీ  వాన ప్రారంభమై అరగంట కురిసింది. ఆ తర్వాత రాత్రి 11.30 గంటలకు కుండపోతగా వర్షం పడింది. 27వ తేదీన రోజంతా  వాన పడుతూనే ఉంది. అర్ధరాత్రి తర్వాత కుండపోతగా కురిసిన వర్షంతో మూసీనదీ పరివాహక ప్రాంతంలోని చెరువులన్నీ నిండిపోయాయి. నీటిని ఇంకింప చేసుకోలేనంతంగా నేల చిత్తడిగా మారింది. ఒకదాని తర్వాత ఒకటి చెరువు కట్టలు తెగిపోయాయి. ఆనాడు పాల్మాకుల, పర్తి చెరువులు చాల పెద్దవి. పాల్మాకులకు దిగువన, హైదరాబాద్‌కు 22 మైళ్ల దూరంలో పర్తి చెరువుంది. పాల్మాకుల, పర్తి చెరువుల కట్టలు తెగిపోవడంతో శంషాబాద్‌ నుంచి వరద నీరంతా మూసీలోకి చొచ్చుకుని వచ్చింది.

సాధారణంగా మూసీ నది రెండు ఒడ్డుల మధ్య దూరం 700 అడుగులు. ఆ రోజు మాత్రం కి.మీ.కు మించిన వెడల్పుతో మూసీ నీళ్లు పారసాగాయి. సెప్టెంబరు 28 మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కోల్సావాడి(ప్రస్తుత ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రి) ప్రాంతంలో ఇళ్లల్లోకి నీరు చేరింది. పురానాపూల్‌ వెనుకతట్టులోకి నీరు చొచ్చుకు వచ్చింది. 3 గంటల ప్రాంతంలో పశ్చిమ దిశలోని నగర రక్షణ గోడ కూలిపోయింది. సాయంత్రం 4 గంటలకల్లా రహదారులపై నీరు ప్రవహించడం ప్రారంభమైంది. ఒక్కసారిగా అప్జల్‌గంజ్‌లో 11 అడుగులకు.. మిగిలిన ప్రాంతాల్లో 10 అడుగులకు వరద చేరింది. రాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. ఈ వరదల్లో వేలాది మంది జలసమాధి అయ్యారు. ఒక్క కోల్సావాడిలోనే రెండు వేల మంది గల్లంతయ్యారంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పేట్లబురుజులో వందల మంది నగర రక్షణ గోడలు ఎక్కారు. అవి కూలి వారంతా వరదలో కొట్టుకుపోయారు. ఎంతో మంది తమ ప్రాణాలను కాపాడుకునేందుకు చెట్లు ఎక్కారు. వరద ప్రవాహానికి ఆ చెట్లతో పాటు వాళ్లూ  కొట్టుకుపోయారు. విక్టోరియా జనానా ఆసుపత్రిలోకి భారీస్థాయిలో నీరు చేరింది. అక్కడి రోగులను కాపాడగలిగారు. ఎనలేని చారిత్రక ప్రాధాన్యమున్న అపార వారసత్వ సంపదను మాత్రం రక్షించలేకపోయారు. వాస్తు నైపుణ్యంతో కూడిన అద్భుత భవనాలెన్నో నాశనమైపోయాయి. మూసీ ఒడ్డున ఉన్న ఇళ్లన్నీ దాదాపుగా నేలమట్టం అయ్యాయి. 20 వేల ఇళ్లు కూలిపోయాయి. 80 వేల మంది నిరాశ్రయులయ్యారు.

ఆ చింతచెట్టుకు చరిత్ర ఉంది… 

చరిత్రలో ప్రత్యేకించి ఓ చెట్టుకు విశిష్ట స్థానం లభించడం ఎంతో అరుదు. అలాంటి అరుదైన ఘనతను పొందింది మూసీకి ఉత్తరాన ఉన్న ఉస్మానియా ఆసుపత్రిలోని ఓ పెద్ద చింతచెట్టు. అది పాత ఇన్‌పేషెంట్‌ బ్లాక్‌లో ఉంది. ఒకప్పుడు ఈ స్థలమంతా ఓ ఉద్యానవనం. 1908 మూసీ వరదల్లో సుమారు 150 మంది దానిపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. రెండు రోజుల పాటు దానిపైనే ఉండిపోయారు. 400 ఏళ్ల కిందటి చింతచెట్టు ఇప్పటికీ సజీవంగా ఉంది. 1924లో ఏడో నిజాం ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించారు. ఈ చెట్టు గొప్పదనాన్ని గౌరవిస్తూ ఏటా నవంబరు 30న హాస్పిటల్‌ డేను ఇక్కడే నిర్వహిస్తుంటారు. 2002లో ఆ చెట్టును ‘ప్రాణధాత్రి’గా అభివర్ణించారు ప్రముఖ కవి రావూరి భరద్వాజ.

హైదరాబాద్‌కు మళ్లీ ఇలాంటి దుస్థితి తలెత్తకుండా చూడాలని అప్పటి నిజాం ప్రభువు ఆనాటి సుప్రసిద్ధ ఇంజినీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు బాధ్యతను అప్పగించారు. రెండు జలాశయాలు నిర్మించాలని.. డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరించాలంటూ ఆయన 1909 అక్టోబరు 1న నిజాం ప్రభువు మీర్‌ మహబూబ్‌ అలీపాషాకు నివేదికను సమర్పించారు. సమగ్ర నగర ప్రణాళికలను తయారు చేయాల్సిన ఆవశ్యకతను అందులో ఆయన నొక్కి చెప్పారు. అప్పటి ప్రఖ్యాత ఇంజినీర్లు దలాల్‌, అలీ నవాజ్‌ జంగ్‌, కద్‌ మైత్యార్‌ జంగల్‌ లాంటి వారు కీలకంగా వ్యవహరించారు. 1912లో సిటీ ఇంప్రూవ్‌మెంట్‌ బోర్డు(సీఐబీ)ను ఏర్పాటు చేశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచనలకు అనుగుణంగానే నగరంలో పౌర వసతుల మెరుగుకు సీఐబీ చర్యలు తీసుకుంది. పార్కులు, బహిరంగ స్థలాలు, ఆటస్థలాలను ఏర్పాటు చేశారు. స్లమ్‌ క్లియరెన్స్‌, హౌజింగ్‌ కాలనీల నిర్మాణం, నూతన తరహాలో మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాటు, దుమ్ములేని రహదారులను నిర్మించారు. 1920లో మూసీ నదిపై నగరానికి పదిమైళ్ల ఎగువన ఉస్మాన్‌ సాగర్‌ ఆనకట్టను కట్టించారు. 1927లో హిమయత్‌సాగర్‌ను నిర్మించారు.

 

 

Posted in Uncategorized

Latest Updates