మెల్‌ బోర్న్‌ టెస్ట్ : ఆస్ట్రేలియా 151 ఆలౌట్.. టీమిండియా అప్పర్ హ్యాండ్

మెల్‌ బోర్న్‌: ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్‌ లో భార‌త్ పట్టు సాధించింది. మొదటి రెండు రోజులు భారత బ్యాట్స్‌ మెన్ స‌త్తా చాట‌గా.. మూడో రోజు బౌల‌ర్లు రెచ్చిపోయారు. ఆస్ట్రేలియాను తక్కువ స్కోర్ కే కట్టడి చేశారు. భార‌త బౌల‌ర్ల ధాటికి ఆసీస్‌ 151 ప‌రుగుల‌కే కుప్ప కూలింది.

ఓవ‌ర్‌ నైట్ స్కోరు 8/0తో మూడో రోజు ఇన్నింగ్స్ కొన‌సాగించిన ఆస్ట్రేలియా .. 24 రన్స్ దగ్గర ఓపెన‌ర్ ఫించ్ (8) వికెట్‌ ను కోల్పోయింది. ఇషాంత్ శ‌ర్మ బౌలింగ్‌ లో మ‌యాంక్‌ కు క్యాచ్ ఇచ్చి ఫించ్ ఔట్ అయ్యాడు. తర్వాత హారిస్ (22)ను బుమ్రా అవుట్ చేశాడు. కొద్ది తేడాలోనే ఖ‌వాజాను జ‌డేజా, మార్ష్‌ ను బుమ్రా పెవిలియ‌న్‌ కు పంపించారు. దీంతో ఆస్ట్రేలియా 89 ప‌రుగుల‌కే 4 టాపార్డ‌ర్ వికెట్ల‌ను కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లు వరుసగా ఔట్ అయ్యారు.

భారత బౌలర్లలో.. బుమ్రా ఆరువికెట్లతో ఆసీస్ వెన్ను విరిచాడు. రవీంద్ర జడేజా రెండు, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు. ఆసీస్ లో హారిస్ 22, పెయిన్ 22 పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్ మెన్ ఇలా వచ్చి అలా వెళ్లారు.

రెండోరోజు ఫస్ట్ ఇన్నింగ్స్ ను 7 వికెట్ల నష్టానికి 443 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసింది టీమిండియా. ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే కట్టడిచేసి… 292 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఆస్ట్రేలియాను ఫాలో ఆన్ ఆడించకుండా.. మళ్లీ భారత్ బ్యాటింగ్ చేస్తోంది.

 

Posted in Uncategorized

Latest Updates