మెల్ బోర్న్ టెస్ట్ : భారత్ 443/7 డిక్లేర్డ్

మెల్‌ బోర్న్: ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మూడ‌వ టెస్టులో భార‌త్ తన మొద‌టి ఇన్నింగ్స్‌ ను ముగించింది. 7 వికెట్లకు 443 ప‌రుగుల దగ్గర ఫస్ట్ ఇన్నింగ్స్ ను టీమిండియా డిక్లేర్ చేసింది. చటేశ్వర్ పుజారా సెంచరీ, కోహ్లీ, రోహిత్ శర్మ హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు.

2 వికెట్ల నష్టానికి 215 పరుగులతో రెండోరోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా.. సానుకూలంగా ఆడింది. భారీస్కోరుపై కన్నేసి.. తొందరపాటు షాట్లకు పోకుండా.. నెమ్మదిగానే ఆడింది. 68 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన పుజారా… 280 బాల్స్ లో 10 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తిచేశాడు. 47 రన్స్ తో రెండోరోజు క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ సెంచరీ వైపు కదిలాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 170 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. స్కోరు బోర్డుపై కేవలం ఆరు రన్స్ తేడాలోనే కోహ్లీ(82), పుజారా(106) వికెట్లను భారత్ నష్టపోయింది.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రహానే(34) , రోహిత్ శర్మ ఇద్దరూ స్కోరు బోర్డును నడిపించారు. ఈ మ్యాచ్ లో టీమ్ చేసిన ఓ ప్రయోగం ఫలించింది. ఫోర్త్ డౌన్ లో వచ్చిన రోహిత్ శర్మ.. 63 ర‌న్స్‌తో నాటౌట్‌ గా నిలిచాడు. రిషబ్ పంత్(39)  తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా(4)…  స్టార్క్ బౌలింగ్‌ లో ఔట్ కాగానే.. ఇన్నింగ్స్‌ ను డిక్లేర్ చేశాడు కెప్టెన్ కోహ్లీ. ఆసీస్ బౌల‌ర్లు ప్యాట్ క‌మ్మిన్స్ మూడు, స్టార్క్ రెండు వికెట్లు తీసుకున్నారు. ఇండియా 2.61 రన్ రేట్ తో.. 169.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 443 రన్స్ చేసింది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా రెండోరోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో 8 రన్స్ చేసింది. ఓపెనర్లు హారిస్, ఫించ్ క్రీజులో ఉన్నారు.

రెండ‌వ టెస్టులో స్థానం కోల్పోయిన రోహిత్‌.. మూడ‌వ టెస్టులో త‌న ఆట‌తీరుతో ఆక‌ట్టుకున్నాడు. ఆసీస్ ప్లేయ‌ర్లు మాట‌ల‌తో రెచ్చ‌గొట్టినా.. కూల్‌ గా బౌండ‌రీల‌తో భారీ స్కోర్ సాధించి కంగారూలకు సవాల్ విసిరారు.

 

 

Posted in Uncategorized

Latest Updates