మేనరికంపై మక్కువ : తెలంగాణలోనే ఎక్కువ

మేనరికం పెళ్లిళ్లపై ఎంత అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నా..సర్వే ఫలితాలల్లో మాత్రం వీటి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. మేనరికాల వల్ల పుట్టబోయే పిల్లలు జన్యులోపంతో పుడతారని నిపుణులు చెబుతున్నా..పెళ్లిళ్లు ఆగడంలేదు. దేశవ్యాప్తంగా చేసిన సర్వేలో తెలంగాణలోనే మేనరికపు వివాహాలు ఎక్కువగా జరుగుతున్నట్లు చెబుతోంది సర్వే. తగిన వయసు రాకముందే పెళ్లి చేసి పంపేయడం.. మేనరికాల వంటివి జాతీయ సగటు కంటే తెలంగాణలోనే ఎక్కువ ఉన్నాయి. ప్రణాళికశాఖ సూచన మేరకు కౌన్సెల్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌ మెంట్‌ సంస్థ (CSD) ఆధ్వర్యంలో ఇలాంటి పలు వివరాలతో తెలంగాణ సామాజికాభివృద్ధి నివేదిక-2018 రూపొందించారు. పలు అంశాలపై 1991 నుంచి 2016 వరకు గణాంకాలను సరిపోల్చి లోతైన అధ్యయనం చేశారు.

CSD కి చెందిన కల్పనా కన్నబీరాన్‌, పద్మినీ స్వామినాథన్‌, జయరాజన్‌ ఈ నివేదిక రూపొందించారు. విద్య, ఆరోగ్యం, పని.. తదితర రంగాల్లో మహిళల పరిస్థితి, వివక్ష అంశాలతోపాటు ఆరోగ్యం, వైద్యం గురించి కూడా ప్రస్తావించారు. జీవనశైలి వ్యాధుల కారణంగా మృత్యువాత పడుతున్నవారి సంఖ్య రాష్ట్రంలో ఎక్కువగా నమోదవుతున్నట్లు వెల్లడించారు. సగటు ప్రజలకు వైద్య ఖర్చులు భారంగా మారాయని, పురుషుల కంటే మహిళలకయ్యే వైద్య వ్యయం ఎక్కువగా ఉంటోందని, ప్రసవ ఖర్చుల్లోనూ దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలోనే అధికంగా వసూలు చేస్తున్నారని వివరించారు.మహిళల సాధికారిత, భద్రత, ఉన్నత చదువుల కోసం తీసుకోవాల్సిన పలు చర్యల గురించి ఈ నివేదికలో కొన్ని సిఫార్సులు చేశారు.

సర్వే వివరాలు
– తెలంగాణలో 18 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటున్న అమ్మాయిలు 30.8 శాతం కాగా, 21 ఏళ్లకు పెళ్లి చేసుకుంటున్న అబ్బాయిలు 13.4 శాతంగా నమోదైంది.
– పెళ్లీడు కంటే ముందే 26 శాతం మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు జరుగుతుండగా.. 18 శాతం మంది అబ్బాయిలకూ అదే జరుగుతోంది.
– మేనరికం వివాహాలు జాతీయ స్థాయి (14 శాతం) కంటే ఇక్కడే అధికం (30 శాతం). ఇందులోనూ తండ్రి తరఫు చుట్టరికంతో పెళ్లిళ్లు 12.7 శాతం.

Posted in Uncategorized

Latest Updates