మే 10న రైతుబంధు పథకం చెక్కులు: సీఎం కేసీఆర్

kcr

రైతు బంధు పథకం ద్వారా రైతులకు పంటసాయం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని వచ్చే నెల 10న ప్రారంభించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. చెక్కులతో పాటే కొత్త పాసుపుస్తకాలను కూడా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.  రోజుకొక గ్రామం చొప్పున అన్ని గ్రామాల్లో రైతులకు చెక్కులు, పాసు పుస్తకాలు ఇవ్వాలన్నారు.

పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమానికి తేదీ ఖరారు చేశారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ ప్రగతి భవన్ లో మంత్రులు, అధికారులతో రివ్యూ చేసిన ఆయన.. చెక్కులు, పాస్ పుస్తకాల పంపిణీకి సంబంధించిన కార్యాచరణపై క్లారిటీ ఇచ్చారు. చెక్కులిచ్చిన రైతుకు నగదు ఇవ్వడానికి వీలుగా బ్యాంకుల్లో కావాల్సిన నిల్వలు ఉంచడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. 58 లక్షల పాసుపుస్తకాల పంపిణీ, చెక్కుల పంపిణీ కార్యాచరణను రూపొందించేందుకు ఈ నెల 21న ప్రగతి భవన్ లో కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 2వేల 761 బృందాలు రోజుకు 1546 గ్రామాల్లో పాసు పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేస్తాయనీ, మే 10న తానే స్వయంగా మొదలుపెడతానని చెప్పారు. వ్యవసాయ మంత్రి, కమిషనర్స్, పరిపాలన శాఖ డైరెక్టర్ కరుణ బృందం రోజుకు నాలుగైదు జిల్లాలు తిరిగి పంపిణీ జరుగుతున్న తీరును పరిశీలించాలని ఆదేశించారు.

పాసుపుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో కలెక్టర్లు పర్యవేక్షించాలని చెప్పారు.  ఏ గ్రామంలో ఏ రోజు పంపిణీ కార్యక్రమం నిర్వహించాలో కూడా కలెక్టర్లే నిర్ణయించాలన్నారు. ఈ విషయాన్ని ప్రసాదర మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పంట పెట్టుబడి కోసం ఎకరానికి 8వేల చొప్పున ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని చిత్తశుద్దితో, పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని సీఎం అధికారులను కోరారు. పూర్తి భూమి వివరాలతో ధరణి వెబ్ సైట్ కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్నారు.

Posted in Uncategorized

Latest Updates