మొక్కలు నాటడాన్ని ఉద్యమ స్పూర్తిగా తీసుకోవాలి : కేటీఆర్

మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ ఉద్యమ స్పూర్తిగా తీసుకోవాలన్నారు మంత్రి కేటీఆర్. బుధవారం (జూలై-11) హైదరాబాద్, గచ్చిబౌలిలోని కొతగూడలో బొటానికల్ గార్డెన్ లోని 12 ఎకరాల పార్కును ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పట్టణీకరణ వేగంగా జరుగుతుందన్నారు. హైదరాబాద్ దేశంలోనే ముందుకు వచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు.  దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకుందని, ఇటీవల అక్కడ జరిగిన క్రికెట్ మ్యాచ్ లో ప్లేయర్లు మాస్కులు కట్టికుని ఆడారని తెలిపారు.

ఈ పరిస్థితి హైదరాబాద్ కు రాకుండా చేస్తామన్నారు. కాలుష్యం రాకుండా మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన కేటీఆర్.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్ బెస్ట్ అన్నారు. గడిచిన నాలుగు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలో హైదరాబాద్ కు గుర్తింపు వచ్చిందన్నారు. మెట్రో, ఫ్లైఓవర్స్ ఎన్ని వచ్చినా..ప్రజల సహకారంతో క్లీనింగ్ లేకపోతే ఎంత అభివృద్ధి చేసినా శూన్యం అన్నారు. పర్యావరణాన్ని కాపాడే హక్కు ప్రతి ఒక్కరిది అన్నారు. హరితహారం వచ్చే ఎన్నికల క్రమంలో  ప్రచారం చేసేది కాదని, ఓ మంచి పని చేసేందుకు సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు.

హరితహారాన్ని విజయవంతం చేయాలని సూచించిన మంత్రి..పెట్టిన మొక్కల్ని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిది అన్నారు. పూర్తిస్థాయిలో నిబద్దతతో హరితహారాన్ని చేపట్టాలన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగి సిటీగా మన హైదరాబాద్ చేరాలంటే అందరి సహకారం ఉండాలన్నారు. సిటీలోని 40 చెరువులను శుద్ధీకరించి, జల కాలుష్యాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. హైదరాబాద్ లో మురికి వాటర్ ను శుద్ధీకరించే పనులను వేగంగా చేపట్టాలని సీఎం చెప్పారన్నారు. ఇందుకోసం హై టెక్నాలజీ ప్లాంట్లను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. సోలార్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ సెకండ్ ప్లేస్ లో ఉందన్నారు. సిటీలో LED లైట్స్ తో కొత్త వెలుగులు తీసుకువచ్చామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా  అన్యాక్రాంతమైపోతున్న చెరువులపై దృష్టి సారించామన్న ఆయన ..తేడాలొస్తే ఉక్కుపాదం మోపుతామని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates