మొటిమ‌ల స‌మ‌స్య పరిష్కారానికి కొన్ని చిట్కాలు

యువ‌తీ యువ‌కులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్లో మొటిమ‌ల స‌మ‌స్య కూడా ఒక‌టి. మొటిమ‌లు ముఖంపై వ‌చ్చాయంటే చాలు… వాటిని పోగొట్టుకోవ‌డానికి వారు ప‌డే తిప్ప‌లు అన్నీ ఇన్నీ కావు. ర‌క ర‌కాల క్రీములు రాయ‌డం, ఫేస్ ప్యాక్‌లు వేసుకోవ‌డం, ఆయిల్స్ రాయ‌డం లాంటి అనేక ప‌నులు చేస్తుంటారు. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు మొటిమ‌ల‌ను త‌గ్గించుకోలేక‌పోతుంటారు. అలాంటి వారు కింద సూచించిన చిట్కాలు పాటిస్తే మొటిమ‌ల‌ను త‌గ్గించుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు.

*ఒక పాత్రలో కొద్దిగా శనగపిండి తీసుకుని, అందులో కాస్త పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. పేస్ట్‌లా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకున్న తర్వాత దాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాలపాటు అలాగే ఉంచుకున్న తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా తర‌చుగా చేస్తే… మొటిమలు తగ్గుతాయి.

*ఒక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా ఉల్లిపాయ‌రసం వేసి, అనంతరం దాంట్లో కొంచెం తేనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు, వాటి మచ్చలపై రాసి… కొద్దిసేపు మర్దనా చేసుకోవాలి. గంటసేపు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత సున్నిపిండితో కడిగితే మంచి ఫలితం లభిస్తుంది.

* గులాబీ రేకులు, బచ్చలి ఆకులు నూరి ముఖానికి రాసుకుని 30 నిమిషాల‌ తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మొటిమలు పోతాయి.

*ఒక స్పూన్‌ మెంతులపొడి, ఒక స్పూన్‌ పసుపుపొడి, దోసకాయగుజ్జు, ఒక స్పూన్‌ టమాట రసం, కొబ్బరినీళ్లు అన్నింటినీ ఒక పాత్రలో తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా త‌ర‌చూ చేస్తుంటే మొటిమ‌లు పోయి ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.

* మెంతికూర, వేపాకు చిగుళ్లు, పసుపు కలిపి నూరాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 5 నిమిషాల పాటు మసాజ్‌ చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు లేక మూడు సార్లు చేస్తే మొటిమలు, మచ్చలు మాయమవుతాయి.

Posted in Uncategorized

Latest Updates