మోడీకి భయపడే ముందస్తు ఎన్నికలు : అమిత్ షా

కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి భయపడే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. కరీంనగర్ జిల్లాలోని అంబేద్కర్ మైదానంలో బీజేపీ సమరభేరి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అమిత్ షా. ఏప్రిల్ లో జరగాల్సిన ఎన్నికలు డిసెంబర్ లో ఎందుకు జరుగుతున్నాయని ఆయన ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికలతో రాష్ట్ర ప్రజలపై కేసీఆర్ అదనపు భారం వేశారన్నారు

కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదన్నారు. కేసీఆర్ తర్వాత కూడా దళితులను సీఎం చేయరని అమిత్ షా అన్నారు. 2014లో మాట నిలుపుకోలేదేని… 2018లో కూడా మాట నిలబెట్టుకోలేరన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదన్నారు.  రాష్ట్రంలోని అమరులను కేసీఆర్ మోసం చేశారన్నారు. దాదాపు 1200 మంది అమరులకు ఉద్యోగాలిప్పిస్తానని ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో లక్ష ఉద్యోగాల నియామకాలు చేపడతానన్న కేసీఆర్ హామీ ఏమైందన్నారు. రాష్ట్రంలో 2లక్షలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా నియామకాలు చేపట్టలేదన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను కూడా పూర్తి చేయలేదన్నారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు.  తెలంగాణ రాష్ట్రంలో 4500మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు అమిత్ షా. కేంద్రం రైతులకు 150శాతం లాభం చేకూరేలా మద్దతు ధర కల్పిస్తోందన్నారు.

మరోవైపు  కాంగ్రెస్ పై కూడా తనదైన శైలిలో స్పందించారు అమిత్ షా. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందోనని భూతద్దంలో చూడాల్సిన పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావు అంతిమ సంస్కారాలు సరిగా చేయలేక అవమానించిందన్నారు. పీవీకి అన్యాయంపై తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నిలదీయాలన్నారు. దేశంలోని అభివృద్ది తెలంగాణ రాష్ట్రంలో జరగాలంటే బీజేపీకి ఓటేయాలని అన్నారు షా.

 

Posted in Uncategorized

Latest Updates