మోడీకి రాహుల్ లెటర్ : మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తాం

మహిళ రిజర్వేషన్‌ బిల్లు అంశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మద్దతు ప్రకటించారు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.  పార్లమెంటులో మహిళ రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెడితే తమ పార్టీ బేషరతుగా మద్దతిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ మేరకు ఆయన సోమవారం (జూలై-16) ట్విటర్‌ లో స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున ప్రధానికి రాసిన లేఖను పోస్ట్‌ చేశారు. మహిళ రిజర్వేషన్‌ బిల్లుకు కాంగ్రెస్‌ మద్దతు ఉంటుంది. 2010 మార్చి 9వ తేదీన మహిళ రిజర్వేషన్‌ బిల్లు రాజ్యసభలో పాస్‌ అయిందనే విషయం మీకు తెలిసిందే.  ఎనిమిదేళ్లయినప్పటికీ లోక్‌సభలో ఆమోదం పొందలేదు. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందినప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత అరుణ్‌ జైట్లీ దీనిని చరిత్రాత్మక బిల్లుగా తెలిపారు.

ఈ బిల్లు ఆమోదానికి కాంగ్రెస్‌ పార్టీ దృఢ నిశ్చయంతో ఉంది. బీజేపీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో మహిళ రిజర్వేషన్‌ బిల్లు గురించి తెలిపింది. మోడీ తన ప్రసంగాల్లో మహిళ సాధికారత గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. మీ ఆశయాన్ని నేరవేర్చుకోవడానికి ఇంతకన్నా మంచి సమయం ఉండదు. మేము బేషరతుగా బిల్లుకు మద్దతు ఇస్తున్నాం. బిల్లు ప్రవేశపెట్టడానికి వచ్చే పార్లమెంట్‌ వర్షకాల సమావేశాల కన్నా మంచి సమయం ఉండదు. దీనిలో జాప్యం జరిగితే రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు బిల్లు ఆమోదం పొందడం అసాధ్యమవుతోంది. లోక్‌సభలో బీజేపీ పూర్తి స్థాయి మెజారిటీ ఉంది. కాంగ్రెస్‌ కూడా మద్దతు తెలుపుతోంది.

ఈ చరిత్రాత్మక బిల్లును సాకారం చేయాల్సిన అవసరం ఉంది అని లెటర్ లో తెలిపారు రాహుల్.  శనివారం (జూలై-14) ఉత్తరప్రదేశ్‌ లో జరిగిన సమావేశంలో మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ముస్లింల పక్షానే నిలుస్తుందని, ట్రిపుల్‌ తలాక్‌ పై వీరు అనుసరిస్తున్న ధోరణే ఇందుకు నిదర్శనమని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఒకవైపు ప్రధాని విమర్శలు, మరోవైపు  జూలై 18 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న క్రమంలో మహిళ రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతు తెలుపుతూ.. రాహుల్‌ గాంధీ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.

Posted in Uncategorized

Latest Updates