మోడీకి రాహుల్ హగ్: అమూల్ ఫీచర్ ఫొటో అదుర్స్ 

అవిశ్వాసంపై చర్చ సందర్భంగా శుక్రవారం (జూలై-21) లోక్‌సభలో  కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు  రాహుల్ గాంధీ చేసిన పని చర్చనీయాంశంగా మారింది. ప్రసంగం ముగిశాక మోడీ దగ్గరకు వెళ్లిమరీ కౌగిలించుకుని, షేక్‌ హ్యాండ్‌ ఇవ్వటం.. ఆపై తన కుర్చీలో కూర్చుని కన్నుకొట్టడం..  సోషల్‌ మీడియా మొత్తం అదే చర్చ నడిచింది. సభా వేదికగా జరిగిన ఈ ఊహించని పరిణామంతో ప్రధానితోసహా  సభలో ఉన్నవాళ్లంతా విస్మయం వ్యక్తం చేశారు. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కూడా రాహుల్‌ చేసిన పనిని తప్పుబట్టారు.

ప్రస్తుతం ఆ వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి అనుకోని…ఆకట్టుకునే సంఘటనలు జరిగితే డైరీ కో-ఆపరేటివ్ సంస్థ అమూల్ ఊరికే ఉంటుందా. అందుకే ఎప్పటిలాగే అమూల్ కూడా ఈ ఘటనను ఎంతో ఆసక్తికరంగా రూపొందించింది. ఇప్పుడు అమూల్ వేసిన సెటైరికల్ ఫీచర్ ఇప్పుడు నెటిజన్లు అమితంగా ఆకట్టుకుంటోంది.

రాహుల్, మోడీని కౌగిలించుకోవడాన్ని ప్రస్తావిస్తూ.. ఆలింగనంగా ఉందా? లేక ఇబ్బందికరంగా ఉందా?’ అంటూ ఓ ఫొటోను విడుదల చేసింది. అంతేగాక, అందులోనే రాహుల్ గాంధీ కన్నుకొట్టడాన్ని కూడా స్కెచ్ వేసింది. కరెంట్ టాపిక్స్‌తో అమూల్ విడుదల చేసిన అనేక క్రియేటివ్ పిక్చర్స్ ఇప్పటికే ఎంతోమందిని ఆకట్టుకున్నాయి.

‘అమూల్ హగ్స్ బ్రెడ్ డైలీ’ అనే కొటేషన్ కూడా ఇవ్వడంతో మరింత ఆకర్షణీయంగా ఈ ఫీచర్ ఫొటో ఉంది. తమ ఉత్పత్తుల ప్రమోషన్ చేయడంలో అమూల్‌ను మించిన వారు లేరంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.  ప్రస్తుతం రాహుల్, మోడీపై వేసిన ఈ ఫీచర్ ఫొటో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. అంతేగాక, అమూల్ ఫీచర్ ఫొటోపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీ క్రియేటివిటీకి హ్యాట్సాఫ్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates