మోడీకి షాక్ మీద షాక్..! మొన్న పనగారియా.. నిన్న సుబ్రహ్మణ్యం.. నేడు ఉర్జీత్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా ఉర్జీత్ పటేల్ రాజీనామా చేశారు. ఉర్జీత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నప్పుడే… మోడీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకుంది. బ్లాక్ మనీని వెలికితీయాలన్న ఉద్దేశంతో నోట్లరద్దు నిర్ణయం తీసుకున్నామని కేంద్రం చెప్పినప్పటికీ… అది జనాన్ని ఇబ్బంది పెట్టింది. క్రెడిట్ మోడీ కొట్టేసినా… దాని తాలూకు నెగెటివ్ ప్రభావం మాత్రం ఆర్బీఐపైనే పడింది. నోట్లరద్దుకు ముందు సరైన ప్రిపరేషన్స్ చేయలేదంటూ పలు సందర్భాల్లో ఆర్బీఐ దోషిగా నిలబడాల్సి వచ్చింది. ఉర్జీత్ పటేల్ తీరుపైనా విమర్శలు వచ్చాయి. ప్రతిపక్షాలు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి. ఈ పరిణామాలు.. ఆర్బీఐ, కేంద్రం మధ్య విభేధాలు, గొడవలకు, మనస్తాపాలకు కారణమయ్యాయి.

రెపో రేటు, రివర్స్ రెపో రేటులతో ఆర్బీఐకి సమకూరే మిగులు అమౌంట్ రూ.2, 3లక్షల కోట్లను తన అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేయాలని కొన్నాళ్లుగా కేంద్రం అడుగుతోంది. దీనికి ఆర్బీఐ ఒప్పుకోవడం లేదు. తనకు అనుకూలంగా ఉండే కొందరిని.. ఆర్బీఐ డైరెక్టర్లుగా అపాయింట్ చేసింది. అలా  కేంద్రం ముందుకు పోవాలనుకుంది. ఐతే… ఆర్బీఐ వ్యవహారాల్లో కేంద్రం జోక్యం పెరగడంతో… ఆర్బీఐ డిప్యూటీ డైరెక్టర్ ఇటీవల ఓ సంచలన కామెంట్ చేశారు. తమ మీద కేంద్రం అజమాయిషీ ఉండొద్దని అన్నారు. ఇటీవల కొద్దిరోజుల కిందట ఉర్జీత్ తో మోడీ సమావేశం అయ్యారు.  దీంతో.. కేంద్రం, ఆర్బీఐ ఒకే లైన్ లో ఉన్నాయనుకున్నారు. కానీ ఇంతలోనే ఉర్జీత్ పటేల్ తన పదవికి రాజీనామా చేయడంతో.. పార్లమెంట్ సమావేశాలకు ముందు కేంద్రానికి పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి.

ఆర్థికపరమైన అంశాల్లో మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో.. వరుస వివాదాలు తలెత్తుతున్నాయి. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే రాజీనామా చేశారు. కేంద్రం కోరినా కూడా ఉండను అని రఘురామ్ రాజన్ వెళ్లిపోయారు. అంతకుముందు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా, ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం కూడా ఇలాగే రాజీనామా చేసి వెళ్లిపోయారు. కేంద్రం విధానాలు నచ్చక రాజీనామా చేసినట్టుగా వార్తలొచ్చాయి. నోట్లరద్దు.. జీఎస్టీ నిర్ణయాలను సరిగా అమలుచేయకపోవడం వల్లే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందన్న ఆరోపణలు పెరిగాయి. వ్యవస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఐతే… ఆర్థిక మంత్రి జైట్లీ ఆ మధ్య ఓ ప్రకటన చేశారు. ఆర్బీఐతో ఇబ్బందులేమీ లేవని చెప్పారు. ప్రధాని మోడీ , ఉర్జీత్ మధ్య ఇటీవల జరిగిన భేటీ తర్వాత పరిస్థితి మారిపోయిందనుకున్నారు. కానీ.. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ఒకరోజు ముందు.. ఈ పరిణామం జరిగింది. పార్లమెంట్ సమావేశాల్లో… ప్రతిపక్షాలకు రాఫెల్ డీల్, ఆర్బీఐ గవర్నర్ రాజీనామా అంశాలు పెద్ద ఆయుధాలు కాబోతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates