మోడీపై అవిశ్వాసం : సభలో ఏ పార్టీకి.. ఎంత బలం

కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో అవిశ్వాస పరీక్షకు సిద్ధమైంది. ప్రభుత్వం పడిపోయే పరిస్థితులు లేకపోయినా.. నంబర్ గేమ్ ఆసక్తిగా మారింది. ఓటింగ్ జరగకుండానే అవిశ్వాసం చర్చ ముగుస్తుందా.. ఒకవేళ ఓటింగ్ జరిగితే ఏం జరుగుతుంది.. ఏ పార్టీకి ఎన్ని సీట్లున్నాయి .. ఏ పార్టీ వైఖరి ఎలా ఉంటుందన్నది ఆసక్తి గా మారింది. అవిశ్వాసంపై అధికార, ప్రతిపక్షాలు ధీమాగా  ఉన్నాయి.

లోక్ సభలో మొత్తం 545 సీట్లు. 10 ఖాళీగా ఉన్నాయి. దీంతో ఎంపీల సంఖ్య 535కు తగ్గింది. ఇందులో సగం అంటే.. 268 మంది ఎంపీలు అవిశ్వాసానికి మద్దతుగా ఓటేస్తే మోడీ ప్రభుత్వం పడిపోతుంది. ఈ పరిస్థితి వచ్చే అవకాశాలు లేవు. ప్రస్తుతం NDA కూటమికి 309 మంది ఎంపీల బలం ఉంది. స్పీకర్ తో కలిపి బీజేపీ బలం 273. శివసేనకు 18 సీట్లు, లోక్ జన శక్తి ఆరు.. శిరోమణి  కాలీదళ్ నాలుగు.. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి మూడు… అప్నాదళ్ కు రెండు.. జేడీయూకు రెండు.. సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ కు ఒక స్థానం ఉన్నాయి. ఇవన్నీ కలిపితే… NDA కూటమి బలం 309 అవుతోంది. 37 మంది ఎంపీలు ఉన్న అన్నాడీఎంకే.. కేంద్రానికి అనుకూలంగా ఓటేస్తే.. అవిశ్వాసానికి వ్యతిరేకంగా 346 ఓట్లు పడే అవకాశాలున్నాయి. శివసేన కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయనుంది.

అవిశ్వాసానికి అనుకూలంగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, టీడీపీ సహా మిగిలిన పార్టీల బలం 150కి మించడం లేదు. కాంగ్రెస్ కు 48 మంది ఎంపీలు, టీఎంసీకి 34, టీడీపీకి 16, సీపీఎంకు 9, ఎన్సీపీకి 7, సమాజ్ వాదీ పార్టీకి ఏడు, ఆమ్ ఆద్మీ పార్టీకి నాలుగు, రాష్ట్రీయ జనతాదళ్ కు నాలుగు, AIUDF కు 3, INLD, IUML, JMM లకు తలో రెండు సీట్ల బలముంది. MIM, NR కాంగ్రెస్, CPI, JKNC, JDS, కేరళ కాంగ్రెస్, NCP, NDP, PMK, RLD, RSP, స్వాభిమాన్ పక్ష పార్టీలకు తలో ఒక ఎంపీ సీటు ఉన్నాయి. వీళ్లంతా అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేస్తే..  ప్రతిపక్షాల బలం మొత్తం 150కి చేరుతోంది.

20 మంది ఎంపీల బలమున్న బిజూ జనతాదళ్, 11 మంది ఎంపీల బలం ఉన్న టీఆర్ఎస్, మరో ముగ్గురు స్వతంత్రులు తమ వైఖరిని ఇంకా చెప్పలేదు. 15 ఏళ్ల తర్వాత లోక్ సభలో అవిశ్వాస తీర్మానం తెరపైకి వచ్చింది. చర్చ జరగబోతుంది.

Posted in Uncategorized

Latest Updates