మోడీ పాలన ఓ డిజాస్టర్ : టీఆర్ఎస్ ఎంపీలు

ఢిల్లీ : కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తప్పుపట్టారు టీఆర్ఎస్ ఎంపీలు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఎంపీలు… నాలుగున్నరేళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక అంశాల్లో ఫెయిలయ్యిందన్నారు. ఆయనది మాటల ప్రభుత్వమే అన్నారు. మోడీ పాలన ఓ డిజాస్టర్ అని అన్నారు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత జితేందర్ రెడ్డి. తెలంగాణలో తప్ప… మరే రాష్ట్రంలోనూ అభివృద్ధి జాడ కనిపించడంలేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో 50 ఫ్లాగ్ షిప్ పథకాలను అమలుచేశామన్నారు. కానీ… మోడీ హయాంలో ఒక్కటంటే ఒక్క ప్లాగ్ షిప్ ప్రోగ్రాం కూడా అమలు కాలేదన్నారు.

కేసీఆర్ నాయకత్వంలో పెండింగ్ అంశాల సాధనకు కృషి చేస్తున్నామన్నారు ఎంపీలు. కేంద్రమంత్రులను కలిసి సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు అందిస్తున్నామని చెప్పారు. పార్లమెంట్ లో పోరాడినప్పటికీ.. విభజన హామీలు అమలవుతాయన్న నమ్మకం తమకు కలగడం లేదన్నారు. సీతారామ ప్రాజెక్టుకి అనుమతులు ఇవ్వాలని, కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. టీడీపీకి లాభం కలిగించేందుకే హైకోర్టు విభజన చేయడం లేదని అన్నారు జితేందర్ రెడ్డి. కొత్త రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తుందనే నమ్మకంతో అనుకూలంగా వ్యవహరించినప్పటికీ.. తెలంగాణకు కేంద్రం నుంచి ఒరిగిందేమీ లేదని అన్నారు జితేందర్ రెడ్డి. ముస్లిం, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం జోక్యం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణలో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ సాధించిన విజయం ఆషామాషీ కాదన్నారు ఎంపీ వినోద్. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ 16 సీట్లు గెల్చుకోవడం ఖాయం అన్నారు ఎంపీ కవిత.

 

Posted in Uncategorized

Latest Updates