యజమాని గొంతుతో ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన చిలుక

 పిల్లి దూరంగా ఉన్నప్పుడు.. ఎలుక ఎకసెకాలాడిందని ఓ సామెత. ఇక్కడ ఓ పెంపుడు చిలుక సరిగ్గా అలాంటి పనే చేసింది. యజమాని ఇంట్లో లేని టైమ్‌ లో చిలిపి పని చేసింది. ఇంగ్లండ్‌ బెర్క్‌‌షైర్‌‌ కౌంటీకి చెందిన మారిన్‌ అనే మహిళ ఓ మగ చిలుకను పెంచుకుంటోంది. దాని పేరు రొక్కో. మారిన్‌ ‘అమెజాన్‌ అలెక్సా డివైజ్‌ ’లో తరచూ ఆర్డర్లు పెడుతుండడం రొక్కో గమనించేది. ఈ క్రమంలో ఓరోజు మారిన్‌ ఆఫీస్‌ కు వెళ్లినప్పుడు ఆమె గొంతును అనుకరించి మరీ ఆ చిలుక ఫుడ్‌ ఆర్డర్‌‌ చేసింది. పుచ్చకాయ, ఎండు ద్రాక్ష, ఐస్‌ క్రీమ్‌.. ఇలా తనకిష్టమైన ఫుడ్‌ అంతా ఆర్డర్‌‌ ఇచ్చుకుంది. ఆఫీస్‌ ముగిశాక తన మొబైల్‌ లో ఆర్డర్‌‌ లిస్ట్‌‌ చూసి మారిన్‌ కంగుతింది. వెంటనే ఆ ఆర్డర్‌‌ను క్యాన్సిల్‌ చేసింది. ఇంటికొచ్చేసరికి రొక్కో రిలాక్స్‌‌గా పాత పాటలు పాడుకుంటూ కూర్చుందట. ‘రొక్కో నా గొంతును అనుకరిస్తుంటే మురిసిపోయేదాన్ని. కానీ, ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు’ అని మారిన్‌ అంటోంది. రొక్కో గతంలోగ్రేట్‌ షెఫర్డ్‌‌లోని ఓ శాంక్చురీలో ఉండేది. దానిని చూసేందుకు వచ్చే సందర్శకులను అది ఇష్టమొచ్చినట్లు తిట్టేదట. అందుకే అధికారులు దానిని అమ్మేశారు. దాని సంగతి తెలీక మారిన్‌ కొనుక్కుంది. రొక్కో ఆఫ్రిక ప్రాంతానికి చెందిన బూడిద రంగు చిలుక. సాధారణంగా ఈ చిలుకలు మనుషుల గొంతులను ఈజీగా అనుకరిస్తాయి.

Posted in Uncategorized

Latest Updates