యువత ఎందుకిలా : SI ఉద్యోగం వద్దు.. కానిస్టేబుల్ ముద్దు

policeచిత్రమైన విషయం.. అవును నీకు SI ఉద్యోగ అర్హత ఉంది.. కష్టపడితే జాబ్ కొట్టేయొచ్చు అంటే.. అబ్బే నాకు ఎస్సై ఎందుకండీ.. కానిస్టేబుల్ ఉద్యోగం చాలు.. క్వాలిఫికేషన్ ఎక్కువ ఉన్నా సరే చిన్న ఉద్యోగం వస్తే చాలు అంటోంది నిరుద్యోగ యువత. ఇది పక్కా నిజం. పోలీస్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులే సాక్ష్యం. పోలీస్ శాఖలో మొత్తం 18వేల 428 పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ వచ్చింది. జూన్ 30వ తేదీ దరఖాస్తుకు చివరి తేదీ. ఇప్పటికే లక్షల్లో నిరుద్యోగులు అప్లికేషన్లు పెట్టుకున్నారు.

ఇప్పటి వరకు మొత్తం ఒక లక్షా 75వేల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో లక్షా 20వేల అప్లికేషన్స్ కేవలం కానిస్టేబుల్ ఉద్యోగాలకే వచ్చాయి. కేవలం 50వేలలోపు మాత్రమే SI పోస్టులకు రావటం ఆశ్చర్యం. కానిస్టేబుల్ ఉద్యోగానికి విద్యార్హత టెన్త్, ఇంటర్. అప్లికేషన్ పెట్టిన అభ్యర్థుల్లో 80శాతం మంది డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చేసిన వారు ఉన్నారు. వీరి సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోకుండా.. కానిస్టేబుల్ పోస్ట్ కు రావటంపై పోలీస్ శాఖ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. విద్యార్హతను బట్టి దరఖాస్తు చేసుకోవాలని.. తక్కువ చదువుకున్న వారికి ఇది ఇబ్బందికర పరిణామం అంటున్నారు రిక్రూట్ మెంట్ అధికారులు.

SI – టెక్నికల్, కమ్యూనికేషన్ కు 3వేల దరఖాస్తులే వచ్చాయి. భవిష్యత్ లో పోలీస్ శాఖలో ఇది కీలక పాత్ర పోషించనుంది. అదే విధంగా ASI – పింగర్ ఫ్రింట్ పోస్టులకు 2వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఎస్సై – కానిస్టేబుల్ మధ్య జీతం చాలా తేడా ఉంది. కనీసం 25వేల రూపాయల వరకు వ్యత్యాసం ఉంది. అయినా కూడా విద్యార్హత ఎక్కువ ఉన్న యువత కూడా కానిస్టేబుల్ ఉద్యోగం వైపు మొగ్గు చూపటం ఆశ్చర్యంగా అనిపిస్తోంది.

Posted in Uncategorized

Latest Updates