యూపీ కల్తీ మద్యం మరణాలపై ప్రత్యేక దర్యాప్తు

ఉత్తరప్రదేశ్ లో కల్తీ మద్యం మరణాలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు చేయించనుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో SIT ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో కలిపి కల్తీ మద్యం సేవించి 124మంది చనిపోయారు. మృతుల కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. ట్రీట్మెంట్ పొందుతున్నవారికి 50 వేల రూపాయలు అందిస్తామంది.

ఉత్తరప్రదేశ్ లోని సహరన్ పూర్, కుషినగర్ జిల్లాల్లో కల్తీ మద్యం మరణాలు జరిగాయి. అయితే రెండింటికి సంబంధం లేదని ప్రభుత్వం తెలిపింది. సహరన్ పూర్ కు సంబంధించిన కొందరు ఉత్తరాఖండ్ లో ఫంక్షన్ కు వెళ్లి అక్కడ విషపూరితమైన మద్యం తాగారని చెప్పారు ఉత్తరప్రదేశ్ ఆబ్కారీశాఖ మంత్రి జయ్ ప్రతాప్ సింగ్. ఫంక్షన్ నుంచి తమ సొంత ప్రాంతానికి వచ్చి చనిపోయారన్నారు. కుషినగర్ జిల్లాలో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

సహరన్ పూర్ లో మృతుల కుటుంబసభ్యులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భర్తలను కోల్పోయిన స్త్రీలకు ఉద్యోగం, పిల్లలకు ఉచిత విద్య అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

మరణాలకు బీజేపీ బాధ్యత వహించాలన్నారు సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అధికారంలో బీజేపీనే ఉందని… ఆ పార్టీదే బాద్యత అన్నారు. మృతుల కుటుంబాలకు 20లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

దుర్ఘటనలపై స్పందించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ. మృతుల కుటుంబాలకు సరైన పరిహారంతో పాటు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇంతమంది చావుకు కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

దారుణం జరిగాక కళ్లు తెరిచిన ఉత్తరప్రదేశ్ అబ్కారీ శాఖ, పోలీసులు.. గుడుంబా స్థావరాలపై దాడులు చేస్తున్నారు. అనేక జిల్లాల్లో నాటు సారా కేంద్రాలను ధ్వంసం చేస్తున్నారు.

Latest Updates