రమణ్‌సింగ్‌ రాజీనామా

రాయ్‌పూర్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలవడంతో ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపినట్లు తెలిపారు. పార్టీ ఓటమికి పూర్తి బాధ్యతను తానే తీసుకుంటానని, కేంద్ర నాయకత్వంపై మోపనని చెప్పారు. పార్టీ నాయకులతో కలసి ఫలితాలపై సమీక్ష జరుపుతామని వెల్లడించారు. రాష్ట్ర సమస్యలపైనే ఎన్నికలు జరిగాయని, వీటికి జాతీయ అంశాలతో సంబంధం లేదని పేర్కొన్నారు.

18 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్‌ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఛత్తీస్‌గఢ్‌కు రమణ్‌సింగే గత 15 ఏళ్లుగా ముఖ్యమంత్రి. ఏ బీజేపీ సీఎం కూడా ఇంతకాలం అధికారంలో లేరు. 2003, డిసెంబర్‌ 7న తొలిసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఆ తరువాత 2008, 2013లోనూ అధికారంలోకి వచ్చారు. ప్రధాని కాక ముందు నరేంద్ర మోదీ 4,610 రోజుల పాటు నిరంతరాయంగా గుజరాత్‌ సీఎంగా కొనసాగగా, రమణ్‌సింగ్‌ ఈ ఏడాది ఆగస్టులో సీఎంగా ఏదు వేల రోజులు పూర్తిచేసుకున్నారు. మోదీ తర్వాత హ్యాట్రిక్‌ విజయాలు సాధించిన తొలి బీజేపీ సీఎంగా గుర్తింపు పొందారు ఆయన.

Posted in Uncategorized

Latest Updates