రష్యా,భారత్ మధ్య డీల్ ఓకే: S-400 క్షిపణుల కొనుగోలు

రష్యాతో దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఉభయ దేశాల మధ్య మొదటినుంచి మంచి సంబంధాలున్నాయన్నారు. ఉగ్రవాదంపై రెండు దేశాలు ఉమ్మడిగా పోరాటం చేయనున్నాయన్నారు.

రెండురోజుల పర్యటన కోసం గురువారం (అక్టోబర్-4) భారత్ చేరుకున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. శుక్రవారం(అక్టోబర్-5) ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు పుతిన్. ఈ సందర్భంగా రెండు దేశాధినేతలు పలు అంశాలపై చర్చించారు. ఈ క్రమంలోనే రష్యాకు చెందిన S-400 క్షిపణులను కొనుగోలు చేసేందుకు భారత్ రష్యాతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది.

రష్యాకు చెందిన S-400 క్షిపణి వ్యవస్థ సుదూర లక్ష్యాలను చేధించగలదు. ఇది ఉపరితలం నుంచి గాలిలో ఉన్న ఎలాంటి లక్ష్యాన్నైనా చేధించగలదు. రష్యా నుంచి ఈ తరహా క్షిపణులు కొనుగోలు చేసిన దేశాల్లో చైనా మొదటిగా నిలిచింది. 2014లోనే చైనా రష్యా నుంచి ఈ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసింది. ముఖ్యంగా 4వేల కిలోమీటర్లు సరిహద్దున్న భారత్ చైనా సరిహద్దులో ఇవి తిష్టవేస్తే రక్షణపరంగా మరింత ఉపయోగం ఉంటుంది.

ఇప్పటికే S-400 క్షిపణులను రష్యా బీజింగ్‌కు డెలివరీ చేసినట్లు తెలిపింది. అయితే ఎన్ని సరఫరా చేశారనే విశయాన్ని తెలిపేందుకు రష్యా నిరాకరించింది. S-300 క్షిపణి వ్యవస్థకు అప్ గ్రేడ్ వర్షెనే ఎస్-400 క్షిపణి వ్యవస్థ.ఈ క్షిపణి వ్యవస్థను రష్యాకు చెందిన అల్మాజ్ అనే సంస్థ 2007 నుంచి ఉత్పత్తి చేస్తోంది.

అమెరికా విధించిన ఆంక్షల క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు క్షిపణి కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మిసైల్ కొనుగోలు అగ్రిమెంట్ తో పాటు అంతరిక్ష సహకారంపై కూడా ఒప్పందం జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సైబీరియాలోని నోవోసిబిర్క్స్‌ నగరం దగ్గర ఇండియన్ మానిటరింగ్ స్టేషన్ నిర్మించేందుకు అగ్రిమెంట్ జరిగినట్లు సమాచారం.

Posted in Uncategorized

Latest Updates