రాజ్యసభలో TRSకి అరుదైన గౌరవం

TRS ఎంపీలకు  రాజ్యసభలోని  మొదటి వరుసలో  ప్లేస్ లభించింది.  పెద్దల సభలో ఆరుగురు సభ్యులు  ఉండటంతో.. ఈ నిర్ణయం తీసుకున్నారు రాజ్యసభ  చైర్మన్  వెంకయ్యనాయుడు. TRS నుంచి కేకేకి ఈ అవకాశం  దక్కింది. రాజ్యసభలో టీఆర్ఎస్ కు ఇది అరుదైన గౌరవం. రాజ్య సభలో టీఆర్ఎస్ కు ప్రస్తుతం 6 సీట్లు ఉన్నాయి. 2014 ఎన్నికలకు ముందు కేకే టీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కాగా.. 2016లో డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మికాంతారావు రాజ్యసభకు వెళ్లారు. మార్చిలో మూడు స్థానాల్లో ఎన్నికలు జరిగితే.. అన్ని స్ధానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. దీంతో రాజ్యసభలో టీఆర్ఎస్ బలం ఆరుకి పెరిగింది. పెద్దల సభలో గుర్తింపు  పొందిన  పార్టీకి  కనీసం ఐదుగురు సభ్యులుండాలి. ప్రస్తుతం ఆరుగురు సభ్యులు ఉండటంతో..TRSకు మొదటి వరసలో సీటు కేటాయించారు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు.

రాజ్యసభలో బీజేపీకి 69 సీట్లు, కాంగ్రెస్ కు 50 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ కాకుండా కొన్ని పార్టీలకు మాత్రమే వారి సంఖ్యా బలం ఆధారంగా మొదటి వరసలో కూర్చోనే అవకాశం ఉంది. మొదటి వరుసలో మొత్తం 20 సీట్లు ఉంటాయి. వీటిలో 4 సీట్లు ప్రధాన మంత్రి,  ప్రతిపక్ష నేత, అధికార పక్షనేత, డిప్యూటీ చైర్మన్ లకు రిజర్వు చేస్తారు. మిగతా 16 సీట్లను ఆయా పార్టీలకు రాజ్య సభలో ఉన్న బలాన్ని బట్టి ముందు వరుసలో ఎవరికీ ఎన్ని సీట్లు ఇవ్వాలో నిర్ణయం తీసుకుంటారు.

సభలో సంఖ్యాబలం ఆధారంగా బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు ఎంపీలు ఆరుగురు ఫస్ట్ రోలో కూర్చుంటున్నారు. కాంగ్రెస్ కు చెందిన ఆరుగురు ఎంపీలు కూడా మొదటి వరుసలో ఉన్నారు.  ఇక మధ్యలో ఉన్న 8 సీట్లను కాంగ్రెస్,బీజేపీయేతర పక్షాలకు కేటాయించారు. 13 మంది ఎంపీలున్న తృణమూల్ కాంగ్రెస్, అన్నాడీఎంకే, సమాజ్ వాదీ పార్టీల నేతలు డేరిక్ ఓబ్రియాన్, నవనీత కృష్ణన్, రాంగోపాలో యాదవ్ లకు ఫస్ట్ రోలో ఎప్పటి నుంచో కూర్చుంటున్నారు. అలాగే  తొమ్మిది మంది బిజూ జనతాదళ్ కు చెందిన  ప్రసన్న ఆచార్య  మొదటి వరుసలోనే  కూర్చుంటున్నారు. 6 సీట్లున్న జేడీయూ నేత రామచంద్ర ప్రసాద్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ఫస్ట్ రోలోనే ఉన్నారు.  రాజ్య సభలో ఆరుగురు ఎంపీలున్న టీఆర్ఎస్ కు ఇప్పుడు ఈ అవకాశం దక్కింది.

మొన్నటి వరకు మొదటి వరుసలో కూర్చొన్న సీపీఎం, బీఎస్పీ నేతలు మాయావతి, సీతారాం ఏచూరి మళ్లీ ఎంపీలుగా ఎన్నిక కాలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత  ఆ పార్టీల సంఖ్యాబలం తగ్గింది.  ప్రస్తుతం సీపీఎంకు ఐదుగురు, బీఎస్పీకి నలుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు. దీంతో ఆరుగురు ఎంపీలున్న టీఆర్ఎస్ కు మొదటి వరుసలో సీటు దక్కింది.

 

Posted in Uncategorized

Latest Updates