సీఎం రమేశ్ ఇంట్లో ఐటీ సోదాలు.. భారీ అక్రమాస్తులు ఉన్నాయంటూ ఆరోపణలు

హైదరాబాద్ : టీడీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇండ్లు, వ్యాపార కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.  హైదరాబాద్‌, విజయవాడ, కడప నగరాల్లో ఒకే సమయంలో.. ఈ సోదాలు కొనసాగుతున్నాయి.  ఆయన చూపించిన ఆదాయానికి, లెక్కలకు పొంతన లేకపోవడంతో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సోదాల్లో.. ఆస్తుల పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. శుక్రవారం పొద్దున 6 గంటల నుంచే సీఎం రమేష్ ఇంట్లో ఐటీ దాడులు మొదలయ్యాయి.

సీఎం రమేష్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక కాంట్రాక్టులు అప్పగించిందనీ.. ఆయన పలు అక్రమాలకు పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. సీఎం రమేష్ కంపెనీ రిత్విక్ కన్ స్ట్రక్షన్ … ఆంధ్రప్రదేశ్ లో భారీ కాంట్రాక్టులు దక్కించుకుందని… పలు పనులను భారీగా అంచనాలు పెంచి, నామినేషన్ పద్ధతి లో సీఎం చంద్రబాబు ఆ కంపెనీకి కట్టబెట్టారని ఆ పోస్టుల్లో ఉంది. కుప్పం బ్రాంచ్ కెనాల్ రూ.522 కోట్ల  పనులు అప్పగించారని.. హంద్రీ నీవా ఫేజ్ 2 లో 2,3,4,5,6 ప్యాకేజీలు… సుమారు రూ.వెయ్యి కోట్ల విలువైన పనులను నామినేషన్ పై ఏపీ ప్రభుత్వం ఇచ్చేసిందని తెలుస్తోంది. గాలేరు నగరిలో 27, 29, 26 ప్యాకేజీల్లో రూ.350 కోట్ల పనులు, వెలిగొండ టన్నెల్ లో రూ.270 కోట్లు పనులు, తెలుగు గంగ లైనింగ్ పనుల్లో రూ.289 కోట్ల కాంట్రాక్ట్ ను రిత్విక్ నిర్మాణ సంస్థకు అప్పగించారని సమాచారం. హంద్రీ నీవా విస్తరణ పనుల్లో  రూ.195 కోట్ల కాంట్రాక్ట్ దక్కించుకుందనీ.. హంద్రీనీవా 34 వ ప్యాకేజి రూ.234 కోట్ల పనులను, గుంత కల్లు బ్రాంచ్ కెనాల్ రూ.172 కోట్ల పనులను.. సీఎం రమేష్ కి చెందిన రిత్విక్ సంస్థకే అప్పగించినట్టు వార్తలొస్తున్నాయి.

చరిత్రలో ఎన్నడూ లేనన్ని పనులు, కాంట్రాక్టులను సీఎం రమేష్ సంస్థకు సీఎం చంద్రబాబు అప్పగించినట్టుగా పోస్టుల్లో వెల్లడైంది. ఇటీవల పబ్లిక్ అకౌంట్ కమిటీ(పీఏసీ) మెంబర్ గా సీఎం రమేష్ ఎన్నికయ్యారు. మూడు రోజుల కింద… సీఎం రమేష్ .. ఐటీ అధికారులకు ఓ లేఖ రాశారు. పబ్లిక్ అకౌంట్ కమిటీ మెంబర్ హోదాలో ఐటీ అధికారులను కొన్ని వివరాలు కోరారు. ఆంద్రప్రదేశ్ లో తమ టీడీపీ నేతలపై ఎలాంటి ప్రతిపాదికన ఐటీ దాడులు చేస్తున్నారో వివరాలు తెలపాలని… సోదాల్లో ఎలాంటి ఆస్తులు గుర్తించారో చెప్పాలని లేఖలో కోరారు సీఎం రమేష్. ఈ లేఖ రాసిన మూడురోజుల్లోనే సీఎం రమేష్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

 

Posted in Uncategorized

Latest Updates