రాజ్యసభ సభ్యులుగా ఏడుగురు ప్రమాణం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు బుధవారం ( జూలై-18) ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో భాగంగా ముందుగా రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆధ్యర్యంలో  ..సోనాల్ మాన్‌సింగ్, రఘునాథ్ మహాపాత్ర, రామ్ శకల్, రాకేశ్ సిన్హా, ఎలామారమ్ కరీమ్, జోస్ మణి, బినోయ్ విశ్వమ్ ప్రమాణస్వీకారం చేశారు.

రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసిన వారిలో రైతు నేత రామ్ శకల్, రచయిత రాకేశ్ సిన్హా, శిల్పి రఘునాత్ మహాపాత్ర, క్లాసికల్ డ్యాన్సర్ సోనాల్ మాన్‌ సింగ్ ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌ లోని రాబర్ట్‌ గంజ్ నుంచి మూడుసార్లు BJP తరఫున ఎంపీగా గెలిచిన రామ్‌ శకల్, రైతులు, దళితులు, కూలీల కోసం విశేషంగా పోరాడారు. RSS భావజాలం కలిగిన ప్రొఫెసర్ రాకేశ్‌ సిన్హా.. ఇండియన్ పాలసీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు. కాలమిస్ట్ కూడా అయిన ఆయన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ICSSR)లో సభ్యులుగా ఉన్నారు. ఒడిశాకు చెందిన పద్మవిభూషణ్ రఘునాథ్ మహాపాత్ర అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన శిల్పాచార్యుడు. పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌ లో ఉన్న ఆరు అడుగుల సూర్యదేవుడి రాతి విగ్రహం ఆయన చెక్కినదే.

1959 నుంచి స్థపతిగా ఉన్న ఆయన శిల్పాచార్యుడిగా ఇప్పటివరకు రెండువేల మందికి శిక్షణ ఇచ్చారు. పూరి జగన్నాథ ఆలయ సుందరీకరణ కోసం పనిచేశారు. భారతీయ శాస్త్రీయ నృత్యానికి వన్నెతెచ్చిన కళాకారిణుల్లో పద్మవిభూషణ్ సోనాల్ మాన్‌ సింగ్ ఒకరు. భరతనాట్యం, ఒడిస్సీ నృత్యరీతుల్ని ఆరు దశాబ్దాలుగా అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శిస్తూ వస్తున్నారు. 1977లో ఢిల్లీలో భారత శాస్త్రీయనృత్య కళల కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.

Posted in Uncategorized

Latest Updates