రాజ్యాంగ నిర్మాతకు నివాళులు : ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

nirmataదేశమంతటా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీలు, నాయకులు, ప్రజా సంఘాలు, ప్రజలు రాజ్యాంగ నిర్మాతకు ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను తలచుకున్నారు నేతలు.
రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా…వీధి వీధినా నివాళులర్పించారు ప్రజలు. పార్లమెంట్ హౌస్ లోని అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ సీనియర్ నేత అద్వానీ, కేంద్రమంత్రులు, ఎంపీలు నివాళులర్పించారు. తర్వాత మధ్యప్రదేశ్ లోని మహూలో జరిగిన జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు రాష్ట్రపతి కోవింద్.

దేశంలోని పేద, అణచివేతకు గురైన లక్షల మంది ప్రజలకు అంబేద్కర్… నమ్మకాన్ని, భవిష్యత్ పై ఆశలు కల్పించగలిగారని ట్వీట్ చేశారు మోడీ. రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ కృషిని ఎన్నటికీ మరువలేమన్నారు. అంబేద్కర్ ఆలోచనలు, జీవితసంఘర్షణ మనకు సమానత్వం, మానవత్వం నేర్పిస్తున్నాయని ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. అయితే అంబేద్కర్ పేరుతో మోడీ చేసే పనులేవీ దళితులను అభివృద్ధి దిశగా నడిపించలేకపోతున్నాయన్నారు BSP అధ్యక్షురాలు మాయావతి.

అన్ని పార్టీల ఆఫీస్ లలోనూ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అంబేద్కర్ ఫొటోకు పూలదండ వేసి నివాళులర్పించారు. అహ్మదాబాద్ లో అంబేద్కర్ కు నివాళులర్పించేందుకు వచ్చిన బీజేపీ నేతలను ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ అనుచరులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దీంతో జిగ్నేష్ మద్దతుదారులు, బీజేపీ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. జిగ్నేశ్ మద్దతుదారుల్లో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత బీజేపీ నేతలు అంబేద్కర్ కు నివాళులర్పించారు.

Posted in Uncategorized

Latest Updates