రాత్రయితే ATM లు బంద్

atm-centreఏటీఎం భద్రత, నిర్వహణ భారం తగ్గించుకునేందుకు బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. నిర్ణీత లావాదేవీల కంటే తక్కువ ఉన్న ATM సెంటర్లను రాత్రి వేళల్లో డీ-లింక్‌ చేసేందుకు చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఐదు కంటే తక్కువ లావాదేవీలు జరిగే ATM సెంటర్లను మూసివేందుకు నిర్ణయించాయి. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ విషయం తెలిపాయి. నిర్వహణ భారంతో పాటు స్కిమ్మింగ్‌ వంటి సైబర్‌ నేరాలు తగ్గించడానికి డీ-లింక్‌ చేయడంతో పాటు ఆయా కేంద్రాలను నిర్ణీత సమయంలో పూర్తిగా మూసేయాలని పోలీసులు సూచించారు. ఈ అంశాన్ని ప్రధాన కార్యాలయాల దృష్టికి తీసుకువెళ్లి తుది నిర్ణయం తీసుకుంటామని బ్యాంకర్లు హామీ ఇచ్చారు.

సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ATM లు సెంటర్లుగా జరిగే సైబర్‌ నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల్ని పోలీసులు బ్యాంకర్లకు వివరించారు. ఈ క్రమంలోనే ATM కేంద్రాల నిర్వహణ అంశం చర్చకు వచ్చింది. రాత్రి వేళల్లో ఐదు కంటే తక్కువ లావాదేవీలు ఉండే ఏటీఎంలను రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు డీ-లింక్‌ చేసి ఉంచాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకర్లు పోలీసులకు తెలిపారు. ఇలాంటి ఏటీఎంలతో ఏసీలు, ఇతర నిర్వహణ ఖర్చులు మినహా ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. నిర్వహణ ఖర్చు తగ్గించడంతో పాటు సైబర్‌ నేరాలను నియంత్రించడానికి ఏటీఎంలను డీ-లింక్‌ చేయడమే కాక పూర్తిగా మూసేయాలని స్పష్టం చేశారు. రాత్రి వేళల్లో ఐదు కంటే తక్కువ లావాదేవీలున్న ఏటీఎంల్లో 95 శాతం మారుమూల ప్రాంతాల్లోనే ఉంటాయి.
ఏటీఎం కేంద్రాలను నిర్ణీత సమయాల్లో మూసి ఉంచితే ఇలాంటి నేరాలకూ ఆస్కారం లేకుండా చేయవచ్చని చెప్పారు. వీటన్నింటినీ లెక్కలోకి తీసుకున్న ప్రతినిధులు విషయాన్ని తమ ప్రధాన కార్యాలయాల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అనుమతి లభించిన వెంటనే అమలులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

Posted in Uncategorized

Latest Updates