రావొద్దంటూ వేడుకోలు : మంచు కొండల్లో మంచినీటి కష్టాలు

simlaసమ్మర్ వచ్చిందంటే చాలు చల్లని ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. వేసవిని తట్టుకుని ఎంజాయ్ చేసేందుకు టూరిస్టులు వెళ్తుంటారు. అలాంటి పర్యాటక ప్రాంతమైన సిమ్లా నీటి కష్టాలు పడుతోంది. దీంతో అక్కడి ప్రజలు నీటి కోసం వాటర్ ట్యాంకర్ల ముందు క్యూ కడుతున్నారు. అంతే కాదు టూరిస్టులను తమ ప్రాంతానికి రావద్దు అంటు విజ్ఞప్తి చేస్తున్నారు.

హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని నగరమైన సిమ్లా తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. వరుసగా ఏడురోజులుగా మునిసిపల్‌ అధికారులు నీటిని సరఫరా చేయడంలేదని… దీంతో నల్లాలు కూడా ఎండిపోయాయని స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నారు. పర్యాటకులు కూడా మాల్‌రోడ్‌లో ఉదయం నుండి నీటి కోసం బారులు తీరుతున్నారు. దీంతో స్థానికులు సీఎంనివాసం ముందు నినాదాలు చేశారు. నిరసనకారులు సిమ్లా-కాల్కా రహదారిని అడ్డుకున్నారు. అయితే ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రభుత్వాన్ని ఎటువంటి చర్యలు చేపట్టారని ప్రశ్నించింది. 15 వాటర్‌ ట్యాంకర్లు, ఎనిమిది పికప్‌ వాహనాల ద్వారా వెంటనే నీటిని అందించాలని తెలిపింది. త్వరలోనే ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తుందని హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం జైరామ్‌ఠాకూర్‌ తెలిపారు.

పర్యాటకులు సిమ్లాకు రాకుండా ఉండాలని పలువురు స్థానికులు ట్వీట్‌ చేస్తున్నారు. సీజన్‌ చివరలో ఎక్కువమంది పర్యాటకులు సిమ్లా ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారని హోటల్‌ యాజమానులు కూడా తెలిపారు. సిమ్లా నగర పరిధిలో రోజుకి 42 ఎమ్‌ఎల్‌డి నీరు అవసరం ఉండగా, కేవలం 22 ఎమ్‌ఎల్‌డి నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఎక్కువగా వీఐపీలు, హోటల్స్‌ ఉండే ప్రాంతాలలోనే నీటినిసప్లై చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates