రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్రాప్ కాలనీలు : పోచారం

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్రాప్ కాలనీలను ఏర్పాటు చేస్తామన్నారు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. వర్షపాతం తక్కువ ఉన్న జిల్లాల్లో పాలీ హౌజ్, గ్రీన్ హౌజ్ ఏర్పాటుకు కృషిచేస్తామన్నారు. దళారీ వ్యవస్థను లేకుండా చేయడంతో పాటు రైతులు పండించే పంటను వారే నేరుగా అమ్ముకునే ఏర్పాట్లు చేస్తామన్నారు.

మార్కెట్లలో దళారీ వ్యవస్థను లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం క్రాప్ కాలనీలపై మినిస్టర్స్ క్వార్టర్లో రైతులు, అధికారులతో సమీక్ష చేశారు. పంటను అమ్ముకోవడంలో రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

వర్షపాతం, భూగర్భజలాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పాలీ హౌజ్, గ్రీన్ హౌస్, క్రాప్ కాలనీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు పోచారం.  ఇందుకు రాష్ట్రం ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా అందిస్తున్నామన్నారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాల్లో ఏర్పాటు చేసిన క్రాప్ కాలనీలతో మంచి దిగుబడి వస్తుందన్నారు. త్వరలోనే అన్ని జిల్లా కేంద్రాలకు దగ్గర్లోని గ్రామాల్లో వీటి ఏర్పాటుకు కృషిచేస్తామన్నారు. రైతులు పండించిన పంటల్ని వారే అమ్ముకునేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు మంత్రి. సీఎం కేసీఆర్ తో చర్చించి హైదరాబాద్ లో ప్రత్యేకంగా మార్కెట్ యార్డులను నిర్మిస్తామని హామీ ఇచ్చారు పోచారం.

 

Posted in Uncategorized

Latest Updates