రాష్ట్రంలో కొత్తగా మరో 2 జిల్లాలు

హైదరాబాద్ : రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు మొదలు పెట్టాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు సీఎం కేసీఆర్. ఆదివారం డిసెంబర్-16న ప్రగతి భవన్ లో పంచాయతీరాజ్ అంశాలతో పాటు, ఎన్నికల హామీలపై సమీక్షించారు కేసీఆర్. ములుగు, నారాయణపేట కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు మొదలు పెట్టాలని రెవెన్యూ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారిని ఆదేశించారు. కోరుట్ల కొత్త రెవెన్యూ డివిజన్ తో పాటు నల్గొండ జిల్లాలో గట్టుప్పల్, భూపాలపల్లి జిల్లాలోని మల్లంపల్లి మండలాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం జనగామ జిల్లాలో ఉన్న గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో కలపాలని సూచించారు.

ఒక రెవెన్యూ డివిజన్, రెండు కొత్త మండల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలన్నారు. పంచాయితీ రాజ్ అధికారులతో రివ్యూ చేసిన సీఎం… డిసెంబర్- 19 నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని చెప్పారు. గట్టుప్పల్, మల్లంపల్లితో పాటు మరో మూడు మండలాల ఏర్పాటుకు ఆదేశించారు.  గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు సీఎం కేసీఆర్. అందుకే గ్రామాలపై అధికారులు ఎక్కువ దృష్టి పెట్టాలని  సూచించారు. రాష్ట్రంలోని ప్రతీ పంచాయితీకి ఒక గ్రామ కార్యదర్శిని నియమించాలని ఆదేశించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. పంచాయతీ ఎన్నికలు పూర్తైన తర్వాత  పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలు స్పీడప్ చేయాలన్నారు.

కొత్తగా 9వేల 355 మంది గ్రామ కార్యదర్శుల నియామక ఉత్తర్వులపై సంతకం చేశారు కేసీఆర్. వీరి ద్వారా గ్రామాభివృద్ధి, పచ్చదనం, పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. డిసెంబర్- 27న  ఎల్బీ స్డేడియంలో పంచాయతీరాజ్ అవగాహన సదస్సు జరుగుతుందని చెప్పారు. అధికారులంతా మధ్యాహ్నం 12 గంటల వరకు స్టేడియంకు చేరుకోవాలన్నారు. గ్రామ కార్యదర్శులు, ఎంపీడీవోలు,ఈవోపీఆర్డీలు, డీపీవోలు, డీఎల్పీవోలు అంతా హాజరుకావాలని చెప్పారు.

 

Posted in Uncategorized

Latest Updates