రాష్ట్రంలో మరో మూడు కొత్త మున్సిపాలిటీలు

కొత్తగా రాష్ట్రంలో మరో మూడు మున్సిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి. గిరిజన ఏజెన్సీ ప్రాంతాలైన భద్రాచలం, ఆసిఫాబాద్, సారపాకలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర మున్సిపాలిటీ శాఖ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి అనుమతులు కోరుతూ గవర్నర్‌ నరసింహన్‌ కార్యాలయానికి కొన్ని నెలలకిందట పురపాలక శాఖ పంపిన ప్రతిపాదనలకు కదలిక వచ్చింది. ఈ ప్రతిపాదనలపై తాజాగా గవర్నర్‌ కార్యాలయం వివరణలను కోరింది. గవర్నర్‌ కార్యాలయం నుంచి పర్మిషన్ వస్తే ఈ ప్రాంతాలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు చట్టపరమైన అడ్డంకులు తొలగిపోతాయని మున్సిపాలిటీ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. 173 గ్రామ పంచాయతీల విలీనంతో రాష్ట్రంలో 68 పురపాలికలను ఏర్పాటుచేస్తూ గత మార్చిలో ప్రభుత్వం అసెంబ్లీలో రాష్ట్ర మున్సిపాలిటీల చట్టం, మున్సిపల్‌ కార్పొరేషన్ల చట్టం,  GHMC చట్టాలకు సవరణలు జరిపింది.

ఏజెన్సీ ప్రాంతాలైన భద్రాచలం, ఆసిఫాబాద్, సరపాకలతో పాటు ఉట్నూరును కూడా మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించింది. షెడ్యూల్డ్‌ ఏరియా పరిధిలో ఈ నాలుగు ప్రాంతాలు ఉండడంతో మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ అనుమతి తప్పనిసరిగా మారింది. గవర్నర్‌ కార్యాలయం నుంచి అనుమతులు లభించకపోవడంతో అప్పట్లో 68 కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుతో ప్రభుత్వం సరిపెట్టుకుంది. ఆ తర్వాత ఉట్నూరు ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గవర్నర్‌ కార్యాలయం నుంచి అనుమతులు లభించిన తర్వాత భద్రాచలం, ఆసిఫాబాద్, సరపాకలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రక్రియ ప్రారంభించనుంది.

Posted in Uncategorized

Latest Updates