రాష్ట్రంలో మరో మూడు రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం : IMD

BALLమరో రెండుమూడ్రోజుల పాటు తెలుగురాష్ట్రాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా వర్షసూచన తక్కువగా ఉన్నా… ముంబైను మాత్రం వరదలు ముంచెత్తాయి. త్రిపుర, అసోం, మేఘాలయ ఇంకా ముంపు నుంచి తేరుకోలేదు. రాజస్థాన్ లో పలుచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ప్రాజెక్టులకు వరద తగ్గుముఖం పట్టిందని అధికారులు తెలిపారు.

మరో ఐదారోజుల పాటు వర్షాలు పెద్దగా ఉండవని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మోస్తర్ వర్షాలు మాత్రమే అక్కడక్కడ పడతాయని తెలిపింది. రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నార్త్ పంజాబ్, నార్త్ హర్యానా, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మరో రెండ్రోజులపాటు వర్షసూచన ఉందన్నారు ఐఎండీ అధికారులు.

రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ముంబైలోని పలుప్రాంతాలు జలమయం అయ్యాయి. కుర్లా, హోజాయ్, గాంధీనగర్ మార్కెట్ ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లల్లోకి నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. జోగేశ్వరి నగర్ లో వర్షాల ధాటికి ఇళ్లు కుప్పకూలాయి. ఎన్డీఆర్ఎప్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

వారంరోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయాయి. త్రిపుర, అసోం, మేఘలాయలో కొన్ని ప్రాంతాలు చెరువుల్లా మారాయి. అంటువ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పునరావస కేంద్రాల్లో తలదాచుకున్న నిర్వాసితులకు ఆహారపదార్థాలు పంపిణీ చేస్తున్నారు.

తెలంగాణ, ఏపీలో మాత్రం మరో నాలుగైదురోజులపాటు వర్షసూచన లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ చిరుజల్లులు తప్ప పెద్దగా వర్షపాతం నమోదు కాలేదన్నారు అధికారులు. రెండుమూడ్రోజులపాటు మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. జూరాల జలాశయానికి పూర్తిగా ఇన్ ఫ్లో తగ్గినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

కర్ణాటక, ఏపీ రాష్ర్టాల పరిధిలో వానలు తగ్గుముఖం పట్టడంతో ఆర్డీఎస్ ఆనకట్టలో వరద నీరు నిలకడగా ఉంది. ఆనకట్టలో కేవలం అడుగున్నర నీరు మాత్రమే నిల్వ ఉంది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు నిలకడగా వరద ఉధృతి కొనసాగుతోంది. డ్యామ్ కు 43వేల 150 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, ఔట్ ఫ్లో 160 క్యూసెక్కులుగా నమోదైంది.

 

 

 

Posted in Uncategorized

Latest Updates