రాష్ట్రపతి దగ్గరకు హైకోర్టు విభజన ఫైలు

ఉమ్మడి హైకోర్టు విభజన చివరి దశకు చేరుకుంది. హైకోర్టు విభజన ఫైలును కేంద్ర న్యాయ శాఖ నిన్న( బుధవారం) రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. ఫైలును రాష్ట్రపతి త్వరలోనే ఆమోదం తెలిపి గెజిట్‌ విడుదల చేస్తారని తెలుస్తోంది. గెజిట్‌ వచ్చిన వెంటనే రెండు రాష్ట్రాల హైకోర్టులు విడివిడిగా పనిచేస్తాయి. అది ఎప్పుడనేది అధికారికంగా ఖరారు కాకున్నా… వచ్చే ఉగాది నుంచి ఆంధ్రప్రదేశ్ లో కొత్త హైకోర్టు కొలువు దీరుతుందని సమాచారం.

అమరావతిలో భవన నిర్మాణం పూర్తయితే హైకోర్టును విభజిస్తామని కేంద్రం అనేక సార్లు చెప్పింది. ఇందులో భాగంగానే హైకోర్టు భవన నిర్మాణాన్ని ఏపీ సర్కారు వేగంగా పూర్తి చేస్తోంది. పనులను హైకోర్ట్ చీఫ్‌ జస్టిస్‌ సహా న్యాయమూర్తులు ఇప్పటికే పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. భవన నిర్మాణం పూర్తవగానే కేంద్రానికి, సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు నివేదిక సమర్పిస్తామని ఏపీ ప్రభుత్వ వర్గాలంటున్నాయి. హైకోర్టును వీలైనంత త్వరగా విభజించాలని.. సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ఎంపీలు ప్రధానిని, కేంద్ర న్యాయ శాఖను తెలంగాణ ఏర్పాటైనప్పటినుంచి డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. తెలంగాణ లాయర్లూ ఇందుకోసం ఎన్నోసార్లు ఆందోళనలు చేశారు. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు జడ్జీల పంపకం పూర్తయింది. సిబ్బందినీ విభజించారు. హైకోర్టును విభజిస్తే ఏపీ హైకోర్టుకు కూడా భవనమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పింది. ఇందుకోసం గచ్చిబౌలిలోని ప్రభుత్వ భవనాన్ని పరిశీలించారు. అయితే అమరావతిలో సచివాలయం, అసెంబ్లీ, మినిస్టర్స్‌ క్వార్టర్స్,ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణంలో భాగంగా హైకోర్టును కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుండటంతో ఆ ప్రతిపాదన ఆగిపోయింది.

Posted in Uncategorized

Latest Updates