రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపిలేకుండా వర్షాలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. బుధవారం (జూలై-11) రాత్రి నుంచి హైదరాబాద్ లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర మధ్యప్రదేశ్, ఉత్తర కోస్తా ఒడిశా ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని చెప్తున్నారు వాతావరణశాఖ అధికారులు. వీటి ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయంటోంది వెదర్ రిపోర్ట్. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు పడతాయంటోంది.

బుధవారం (జూలై-11) నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో అత్యధికంగా 5 సెం,మీ వర్షం కురిసింది. వనపర్తిలో 4, నిజామాబాద్ బోధన్ , డిచ్ పల్లిలో 3, జోగుళాంబ గద్వాల, అలంపూర్, నిజామాబాద్ లో 2 సెంమీ వర్షపాతం నమోదైంది. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో నిన్న మోస్తరు వర్షం పడింది. హైదరాబాద్ లో బుధవారం రాత్రి నుంచి పలుచోట్ల రాత్రి వర్షం పడింది. ఇవాళ, రేపు సిటీలోని పలుచోట్ల మోస్తరు నుంరి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తుంది వాతావరణశాఖ.

జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. భద్రాద్రిలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. నిన్న ఉదయం 30.2 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం రాత్రికి కొంత తగ్గింది. చర్ల మండలం తాలిపేరు రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు చేరడంతో 2 గేట్లు ఎత్తి 19 వందల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates