రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులు భారీ వర్షాలు

dc-Cover-8e34hbfl4i79rn6rc49nfkih33-20171009012441.Mediతెలంగాణలో పాలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం. వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడిందని, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరి తల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్‌ జిల్లాల్లోని ఒకట్రెండు చోట్ల సోమవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవచ్చని, ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఆదివారం (జూలై-8) ఓ ప్రకటనలో తెలిపింది వాతావరణ కేంద్రం.

సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్, కొమురం భీం, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఆదివారం (జూలై-8) కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో 9 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. ఏన్కూరులో 7 సెంటీమీటర్లు, వెంకటాపూర్, ఖమ్మం అర్బన్, జూలూరుపాడులలో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షాలు కురిశాయి. చింతకాని, ఎల్లారెడ్డి, డోర్నకల్, బయ్యారం, అశ్వారావుపేట, మణుగూరు, కొత్తగూడెం, మధిర, గోవిందరావుపేట, నాగరెడ్డిపేట, భిక్నూరు, తల్లాడ, బోనకల్, గార్ల, జుక్కల్‌లలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. వర్షాలు ఊపందుకోవడంతో అన్నదాత కాస్తంత ఊరట చెందుతున్నాడు. ఇప్పటివరకు వర్షాలు సరిగా లేకపోవడంతో అనేక చోట్ల వేసిన విత్తనాలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. తాజా వర్షాలతో ఈ పరిస్థితి నుంచి బయటపడొచ్చని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates