రాష్ట్రానికి రావల్సిన పెండింగ్ నిధులు విడుదల చేయండి : ఈటల

జాతీయ రహదారులను విస్తరించండి, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయండి. హామీలను త్వరగా అమలు పర్చాలి. ఇదీ కేంద్ర మంత్రుల దగ్గర రాష్ట్ర మంత్రుల విన్నపాలు. ఢిల్లీలో పర్యటించిన రాష్ట్ర మంత్రులు ఈటల, మహేందర్ రెడ్డి…రాష్ట్రంలోని సమస్యలను కేంద్ర మంత్రులను వివరించారు.
ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిశారు రాష్ట్ర మంత్రులు. రాష్ట్ర సమస్యల్ని కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రామ్ విలాస్ పాశ్వాన్ల దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రానికి సంబంధించిన రహదారుల అంశాలపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో చర్చించారు. హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ఉన్న రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని కోరారు. మంచిర్యాల నుంచి చంద్రపూర్ వరకు జాతీయ రాహదారి పనుల్ని వెంటనే ప్రారంభించాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారన్నారు మంత్రి ఈటల రాజేందర్.
ఆ తర్వాత కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తో సమావేశమయ్యారు. 2014లో రాష్ట్రం ఏర్పడే నాటికి దేశంలో లెవీ 75 శాతం ఉండేదని…ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లెవీని 75 నుంచి 25కి తగ్గించిందన్నారు. దీంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతుందన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన బియ్యం డబ్బులను తక్షణమే విడుదల చేయాలని కోరామన్నారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి….వచ్చే నెల 2న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలిపారన్నారు.
మరోవైపు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కలిశారు మంత్రి మహేందర్ రెడ్డి. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ROBల నిర్మాణాలు చేపట్టాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు మంత్రి.

Posted in Uncategorized

Latest Updates