రాష్ట్రాన్ని వణికిస్తోన్న చలి..

రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రోజురోజుకు టెంపరేచర్లు పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో మరింత ఎక్కువ చలి ఉండటంతో జనం గజగజలాడుతున్నారు. చలికి తోడు మంచు కురుస్తుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. సూర్యుడు 9గంటలు దాటినా బయటకు రాని పరిస్థితి. చలి మంటలు వేసుకొని రిలాక్స్ అవుతున్నారు జనం. పొగ మంచుకారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్ లో చలి పంజా విసురుతోంది. మంగళవారం 16.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇది సాధారణం కంటే 3డిగ్రీలు తక్కువగా రికార్డు అయినట్లు అధికారులు చెబుతున్నారు. చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుందన్నారు. రాగల మూడు రోజుల్లో సిటీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందన్నారు వాతావరణశాఖ అధికారులు. గాలిలో తేమ శాతం కూడా 44 శాతానికి తగ్గడంతో చలి తీవ్రత పెరిగిందంటున్నారు.

ఉత్తరాధి నుంచి రాష్ట్రం వైపు చలి గాలులు వీస్తుండటంతో.. జనం వణికిపోతున్నారు. రాత్రివేళలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయంటున్నారు అధికారులు. మొన్నటి వరకు పెథాయ్ తుఫాన్ కారణంగా చలి పెరిగితే.. ప్రస్తుతం ఉత్తరాధి నుంచి వీస్తున్న గాలులతో చలి తీవ్రత పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో వచ్చే రెండు, మూడు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని చెప్పారు హైదరాబాద్ వాతావరణ అధికారులు.

Posted in Uncategorized

Latest Updates