రాష్ట్ర విభజన హామీలను అమలు చేయండి : మోడీని కోరిన కేసీఆర్

ఢిల్లీ : రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక… మొదటిసారి ఢిల్లీ వెళ్లిన కేసీఆర్…. ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని 7 లోక కళ్యాణ్  మార్గ్ లో ప్రధాని నివాసంలో 40 నిమిషాల పాటు ఇద్దరి భేటీ జరిగింది. పెండింగ్ లో ఉన్న రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని మోడీని కోరారు కేసీఆర్. 16 అంశాలతో వినతి పత్రాన్ని ప్రధానికి ఇచ్చారు ముఖ్యమంత్రి.

రాష్ట్రంలో కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ నిర్మాణం కోసం బైసన్  పోలో భూములను ఇవ్వాలని మోడీని కోరారు కేసీఆర్. దీంతో పాటు రోడ్ల విస్తరణ కోసం రక్షణ శాఖకు చెందిన భూముల బదిలీకి అనుమతివ్వాలన్నారు. కరీంనగర్ లో ట్రిపుల్  ఐటీ, హైదరాబాద్ లో IIM ఏర్పాటు చేయాలని మోడీకి విజ్ఞప్తి చేశారు కేసీఆర్. కొత్తగా ఏర్పాటైన 21 జిల్లాల్లో జవహర్  నవోదయ విద్యాలయాలతో పాటు… గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేయాలన్నారు. రాజధానిలో IISER  కేంద్రంతో పాటు, ఆదిలాబాద్ లో సిమెంట్ ఫ్యాక్టరీకి అనుమతివ్వాలని అడిగారు. జహీరాబాద్ లో నేషనల్  ఇన్వెస్ట్ మెంట్  అండ్ మ్యానుఫేక్చరింగ్  జోన్ … నిమ్జ్  ఏర్పాటు చేయాలని కోరారు. వరంగల్లో కాకతీయ మెగా టెక్స్ టైల్  పార్కుకు నిధులివ్వాలని అడిగారు కేసీఆర్. కృష్ణానదీ జలాల వివాదంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, నదీ జలాల పంపకాల్లోని వివాదాలను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్నారు కేసీఆర్. పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు వెంటనే పూర్తి చేయాలని కోరారు. ప్రధానితో భేటీ తర్వాత కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు కేసీఆర్. విభజన హామీలు అమలు, షెడ్యూల్ 9, 10 లో చేర్చిన ఆస్తుల విభజనపై మాట్లాడారు. ఎంపీ వినోద్ కుమార్ తో పాటు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు రాజీవ్ శర్మ రాజ్ నాథ్ ను కలిసిన వారిలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెప్పారు TRS ఎంపీలు. ఢిల్లీలోనే ఉన్న కేసీఆర్… రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాలు, నిధులపై మరికొంతమంది కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates