రాష్ట్ర వ్యాప్తంగా తగ్గిన వర్షపాతం


రాష్ట్రంతో వానలు దోబూచులాడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు  కురిసినా మిగతా చోట్ల అనుకున్న స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. సీజన్ లో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4 శాతం తక్కువగా వర్షపాతం నమోదయినట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. జూన్ లో వర్షాలు ఎక్కువగా కురవడంతో   25 శాతం అధికవర్షపాతం నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 48 శాతం లోటు వర్షపాతం రికార్డయింది. మిగతా అన్ని జిల్లాల్లో సాధారణం… సాధారణం కన్నఎక్కువగానే వర్షాలు కురిశాయి. జూన్ లో మహబూబాబాద్ 67 శాతం , నిజమాబాద్ లో 46 శాతం,  సూర్యాపేట లో 82 శాతం, భువనగిరిలో 61 శాతం వర్షాపాతం నమోదైంది.

ఇక జులైలో 3 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. వీటి ప్రభావంతో వానలు బాగా పడాలి. కానీ..  15 శాతం లోటు వర్షపాతం నమోదయ్యింది. సంగారెడ్డి లో 63 శాతం, మెదక్ లో 66 శాతం, మల్కాజ్ గిరి 56, కామారెడ్డి 46 శాతం లోటు వర్షాపాతం రికార్డయ్యింది. మొత్తంగా 19 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మూడు అల్పపీడనాలు ఏర్పడినా.. ఒక అల్పపీడనం కారణంగానే రాష్ట్రంలో వర్షాలు కురిశాయి.

ప్రస్తుతం బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి వీస్తున్న గాలులు ఒకేచోట కలవడం వల్ల రాష్ట్రం మీదుగా షియర్ జోన్ ఏర్పడిందని  దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందంటున్నారు వాతావరణశాఖ అధికారులు. మరో 4 రోజులుపాటు ఇలాంటి వాతావరణమే ఉంటుందంటున్నారు.

ఈ నెలలో కూడా వర్షాలు తక్కువగానే పడతాయని.. సెప్టెంబర్ లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెబుతున్నారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates