రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పోలింగ్


రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైయ్యాయి.119 నియోజకవర్గాల్లో పోటీ చేసిన 1,821 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు ఓటర్లు.మల్కాజిగిరిలో  అత్యధికంగా 42 మంది బరిలో ఉండగా… బాన్సువాడలో అతి తక్కువగా ఆరుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్ 107, కాంగ్రెస్ నుంచి 99,  బీజేపీ 118,  సీపీఎం  26, CPI 3, NCP 22, BSP 107, టిడిపి 13, MIM 8 మంది పోటీ చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగనుంది. సమస్యాత్మక ప్రాంతాలైన  సిర్పూర్, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ , మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటలకే పోలింగ్ ముగియనుంది.

రాష్ట్రంలో 2కోట్ల 80లక్షల64 వేల 684 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో  కోటి 41లక్షల 56 వేల 182 మంది పురుషులు, కోటి 39లక్షల 5వేల 811 మంది మహిళలు, 2వేల 691 మంది ఇతరులు ఉన్నారు. ఎక్కువగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 5 లక్షల 75 వేల 541 మంది ఓటర్లున్నారు. భద్రాచలం నియోజకవర్గంలో అతి తక్కువగా లక్షా 37 వేల 319 మంది ఉన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక్కడ 3 లక్షల 7 వేల 348 మంది పురుష ఓటర్లున్నారు. భద్రాచలంలో పురుషు ఓటర్లు అతితక్కువగా 66 వేల 604 మంది ఉన్నారు. కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో మహిళా ఓటర్లు అత్యధికంగా 2 లక్షల 41 వేల 64 మంది, భద్రాచలం నియోజకవర్గంలో అతి తక్కువగా 70 వేల 6 వందల 91 మంది ఉన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 32వేల 815 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు 44 వేల 415 బ్యాలెట్ యూనిట్లు, 32 వేల 16 కంట్రోల్ యూనిట్లు, 32 వేల 16వీవీ ప్యాట్లు ఉపయోగిస్తున్నారు.  ఎన్నికల విధుల్లో 2లక్షల మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు.

పోలింగ్ కు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకున్నారు.పోలింగ్ లో పారదర్శకత కోసం మొదటిసారిగా వీవీపాట్ లను అందుబాటులోకి తెచ్చారు. పోలింగ్ సరళిని ప్రజలకు, మీడియాకు తెలిపేందుకు.. సెక్రటేరియట్ లోని  D-బ్లాక్ లో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ పై.. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పోలింగ్ వివరాలను ప్రదర్శిస్తారు. 31 జిల్లాలో 3 వేల470 ఏరియాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు.సాయంత్రం 5 గంటల వరకు వచ్చే ప్రతి ఓటరుకు ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు.

Posted in Uncategorized

Latest Updates