రాష్ట్ర వ్యాప్తంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

రాష్ట్ర వ్యాప్తంగా ఆషాడ శుద్ద ఏకాదశిని ఘనంగా జరుపుకున్నారు జనం. పెద్దేకాశి పండుగ సందర్భంగా…శివ కేశవుల ఆలయాలు రద్దీగా మారాయి. ప్రత్యేక  అభిషేకాలు, పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునుంచే ఆలయాలకు క్యూ కట్టిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. యాదాద్రి,భద్రాద్రి, వేములవాడ, కీసరగుట్టలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు.

తొలిఏకాదశి సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహుడి పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. పండుగ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. స్వామి, అమ్మవార్లకు లక్షపుష్పార్చన నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య వివిధ రకాల పుష్పాలతో అర్చన చేశారు. స్వామివారిని పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.

సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో నిండిపోయింది. సోమవారం, ఏకాదశి కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. పండుగ సందర్భంగా రాజన్నకు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు పండితులు. భద్రాద్రి రాములోరి సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. తొలి ఏకదాశి సందర్భంగా సీతారాములకు ప్రత్యేక పూజలు, ఆలంకరణ చేశారు అర్చకులు. తొలి ఏకాదశి సందర్భంగా వరంగల్ లోని శివ,కేశవుల ఆలయాలు కిక్కిరిశాయి. వేయిస్థంబాల గుడిలో రుద్రేశ్వరుడికి ప్రత్యే అభిషేకాలు చేశారు భక్తులు. భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని వేలాదిగా దర్శించుకున్నారు భక్తులు. ఏకాదశి సందర్బంగా తెల్లవారుజామునుంచి పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. ముక్తీశ్వరుడికి అభిషేకాలు, అర్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. తొలి ఏకాదశి రోజున పల్లెల్లో రైతులు ప్రత్యేక పూజలు చేసి… వ్యవసాయ పనులు మొదలుపెడుతున్నారు. అటు నల్లగొండ జిల్లా చెర్వుగట్టు పార్వతీ సమేత జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఏకాదశి కావడంతో స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో వచ్చారు భక్తులు. ఉదయం నుంచే స్వామివారికి రుద్రాభిషేకం , అర్చనలు నిర్వహించారు అర్చకులు.

రంగారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కీసరగుట్టకు భక్తులు భారీగా తరలివచ్చారు. పండగ సందర్భంగా శ్రీభవానీ రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. జగిత్యాల జిల్లా ధర్మపురి నరసింహుడి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. తొలి ఏకాదశి పండుగ కావడంతో పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు చేసి నరసింహుడిని దర్శించుకున్నారు జనం.  అటు పెద్దపల్లి జిల్లా మంథని గౌతమేశ్వరాలయంలోనూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి.

 

 

Posted in Uncategorized

Latest Updates