రికార్డు స్థాయిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు…వణుకుతున్నభాగ్యనగరం

హైదరాబాద్ వణికిపోతోంది. పాతికేళ్ల తర్వాత…. హైదరాబాద్ లో పగటి పూట ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదయ్యాయి. పెథాయ్ తుఫాన్ ప్రభావంతోనే టెంపరేచర్లు పడిపోతున్నాయని చెప్తున్నారు వాతావరణశాఖ అధికారులు. బంగాళాఖాతం నుంచి చలి గాలుల ప్రభావం కూడా రాజధానిపై ఉందంటున్నారు. ఈ నెల 18 న హైదరాబాద్ లో మధ్యాహ్నం పూట గరిష్ఠ ఉష్ణోగ్రత 19.8 డిగ్రీలుగా రికార్డైంది. ఇది 25 ఏళ్ల క్రితం నాటి రికార్డుకు సమానమని చెబుతున్నారు వెదర్ ఆఫీసర్లు. 1993 డిసెంబర్ 6 న పగటిపూట 19.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. మామూలుగా… పగటిపూట 29 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది. రెండు రోజుల క్రితం… ఒక్కసారిగా 9 డిగ్రీల వరకు తగ్గింది.

హన్మకొండ, నిజామాబాద్ లో కూడా మామూలు కన్నా… 10 నుంచి 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గడం మరో రికార్డుగా చెబుతున్నారు వాతావరణశాఖ అధికారులు. నిన్న(బుధవారం) మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలకు పెరిగాయి. మధ్యాహ్నం హైదరాబాద్ లో 24. 9 డిగ్రీల టెంపరేచర్ ఉంటే…. ఆదిలాబాద్ లో తెల్లవారుజామున అతి తక్కువగా 5 డిగ్రీలు నమోదైంది. ఇది ఈ సీజన్లోనే అతి తక్కువ టెంపరేచర్ అని చెబుతున్నారు  వాతావరణశాఖ అధికారులు.

పెథాయ్ తుఫాన్, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో…. మూడు రోజులుగా చలి విపరీతంగా పెరిగింది. దీంతో మధ్యాహ్నం టైమ్ లో కూడా జనం ఇళ్ల నుంచి రాలేని పరిస్థితి. చలి తీవ్రత తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 31 మంది చనిపోయారని చెప్తున్నారు అధికారులు. మరోవైపు తుఫాన్ ప్రభావం తగ్గడంతో…. ఇవాళ (గురువారం) మధ్యాహ్నం నుంచి చలి తీవ్రత పెద్దగా ఉండదంటున్నారు వాతావరణశాఖ అధికారులు. వచ్చే 3 రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 29 డిగ్రీలుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates