రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం


రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా మంగళవారం ఉదయం విద్యుత్‌ డిమాండ్‌ 10,429 మెగావాట్లకు చేరిందన్నారు విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి. ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు, దక్షిణ డిస్కం సీఎండీ రఘుమారెడ్డిలతో కలసి నిన్న(మంగళవారం-జూలై 31న) విద్యుత్‌ సౌధలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014 జనవరి 23న రోజూవారీ విద్యుత్‌ డిమాండు 6,660 మెగావాట్లుండగా, మంగళవారం రికార్డు స్థాయిలో 10,429 మెగావాట్లకు చేరిందన్నారు. ప్రస్తుత వానాకాలం(ఖరీఫ్‌)లో ఇది మరింత పెరగనుందని అంచనా వేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజల తలసరి విద్యుత్‌ వినియోగం 1,507 యూనిట్లకు చేరిందని, ఇది జాతీయ సగటు 1,122 యూనిట్ల కన్నా 34 శాతం అధికమన్నారు. వినియోగం పెరగడం రాష్ట్ర అభివృద్ధికి సూచికని వివరించారు మంత్రి. రాష్ట్రం ఏర్పడిన ఆరునెలల్లోనే గృహ, పరిశ్రమ, వాణిజ్య అవసరాలకు, మూడేళ్లలోనే వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాను అందించిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందన్నారు. రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలకు 10,852 మెగావాట్ల విద్యుత్‌ అవసరమన్నారు.

అభివృద్ధికి సంకేతం: సీఎం కేసీఆర్‌ 

విద్యుత్‌ డిమాండ్‌ రికార్డు స్థాయికి చేరిన సందర్భంలో ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ దేవులపల్లి అభినందించారు ప్రభాకరరావును సీఎం కేసీఆర్‌. మంగళవారం ప్రభాకరరావును సీఎం ప్రగతిభవన్‌కు పిలిపించారు. 10,429 మెగావాట్ల డిమాండ్‌ ఏర్పడినా నిమిషం కూడా కోత విధించకుండా సమర్థంగా సరఫరా చేశారంటూ ఆయనను ప్రశంసించారు సీఎం. విద్యుత్‌ శాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన అనుభవం తెలంగాణలో విద్యుత్‌ విజయాలకు దోహదం చేసిందని కితాబిచ్చారు. భవిష్యత్తులోనూ విద్యుత్తు ఇబ్బందులు ఉండవన్న నమ్మకంతో పరిశ్రమలు తరలిరావడానికి దోహదం చేస్తుందని, ఇదంతా అంతిమంగా రాష్ట్రం అభివృద్ధికి దోహదపడుతుందన్నారు కేసీఆర్. సీఎండీతో పాటు ఈ విజయాలకు కారణమైన విద్యుత్‌ సిబ్బందికీ  అభినందనలు తెలిపారు సీఎం.

Posted in Uncategorized

Latest Updates