రిజర్వేషన్ లేదు : ప్రైవేట్ వర్సిటీల్లో 25% సీట్లు తెలంగాణకే

kadiyamప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం.. అందుకు సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులు, పోటీతత్వానికి అనుగుణంగా తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు విద్యా మంత్రి కడియం. తెలంగాణ నుంచి పరిశోధన, నవకల్పన, నాణ్యమైన విద్యను అందించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

ఇక ప్రైవేట్ వర్సిటీల్లో ప్రవేశానికి ప్రభుత్వం ఎలాంటి రిజర్వేషన్లు ప్రకటించలేదు. అయితే రాష్ట్రంలో ఏర్పాటు చేసే ప్రతి ప్రైవేట్ యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థులకు కచ్చితంగా 25శాతం సీట్లు కేటాయించాలనే నిబంధన తీసుకొచ్చారు. ప్రవేశాలు, ఫీజుల విషయంలో వర్సిటీలకు స్వయంప్రతిపత్తి కల్పించారు. యూనివర్సిటీ ఏర్పాటుకు చేసే దరఖాస్తుల పరిశీలనకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఆ కమిటీ 60 రోజుల్లో తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. నివేదిక ఆధారంగా యూనివర్సిటీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే అంశాన్ని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. నిబంధనలకు అనుగుణంగా ఉంటే 30 రోజుల్లో అనుమతులు జారీ చేస్తుంది. యూనివర్సిటీ పాలనా మండలిలో సెక్రటరీ స్థాయి అధికారి ప్రభుత్వ ప్రతినిధిగా ఉంటారు.

ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటుకి చాలా మంది ముందుకు వస్తున్నా.. తొలి దశలో మూడు, నాలుగు వర్సిటీలకే అనుమతివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకేసారి ఎక్కువ వర్సిటీలకు అనుమతులిస్తే విద్యలో ప్రమాణాలు తగ్గుతాయని అభిప్రాయానికి వచ్చింది ప్రభుత్వం.

Posted in Uncategorized

Latest Updates