రివ్యూ : ఆటగదరా శివ

నటీ నటులు : దొడ్డన్న, ఉదయ్ శంకర్, హైపర్ ఆది

దర్శకత్వం : చంద్ర సిద్దార్ధ

నిర్మాత : రాక్ లైన్ వెంకటేష్

సంగీతం : వాసుకి వైభవ్

విడుదల : జూలై 20, 2018

ఆ నలుగురు, అందరి బంధువయ్యా సినిమా దర్శకుడు చంద్ర సిద్దార్ధ నుంచి వచ్చిన మరో సినిమా ఆటగదరా శివ. రొటీన్ సినిమా కాదని.. భిన్నంగా ఉంటుందని ముందుగానే ప్రకటించారు. మరి ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఆటగదరా శివ మెప్పించిందా లేదా చూద్దాం..

కథ :

జైలు నుంచి మరికాసేపట్లో ఉరి కంబం ఎక్కబోతున్న ఖైదీ బాబ్జి తప్పించుకుంటాడు. అదే సమయంలో బాబ్జీకి ఉరి తీయటానికి ఇంటి నుంచి బయలుదేరతాడు తలారి జంగయ్య. వీళ్లిద్దరూ కలుసుకుంటారు. ఒకే జీపులో ప్రయాణిస్తారు. మధ్యలో వీరికి లేచిపోయి పారిపోతున్న హైపర్ ఆది ప్రేమ జంట కలుస్తుంది. చంపేవాడు – చచ్చేవాడు ఇద్దరూ కలిసి చేసే జర్నీలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి.. ఎవరు ఎవరి చేతిలో చనిపోతారు.. విధి ఆడే వింత నాటకం ఎలా ఉంటుంది అనేది చిత్రం కథ.

కథనం :

సినిమాను నడిపించిన తీరు ఆసక్తిగా ఉంది. రొటీన్ గా భిన్నంగా ఉంది. భారీ సెట్స్ ఏమీ లేవు. నేచురల్ గా ఉంది. తలారి జంగయ్య పాత్ర మలిచిన తీరు చక్కగా ఉంది. పాత్రకి తగ్గట్టుగా చక్కగా సరిపోయాడు. డైలాగ్స్ కంటే.. తన హావభావాలతోనే మెప్పించిన విధానం ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. కన్నడ సినిమా రామ రామరే రీమేక్ ఇది. అందులో దొడ్డన్న పాత్రే.. ఇందులో జంగయ్య పాత్ర. ఇక ఉరిశిక్ష పడిన ఖైదీ బాబ్జీ పాత్రలో ఉదయ్ శంకర్ నటించాడు. డైలాగ్స్ చాలా చాలా తక్కువ. తప్పించుకుంటూ.. పరిగెత్తుతూనే ఉంటాడు. అచ్చం ఖైదీగానే ఉంటాడు. పాత్ర పరంగా తన నటించిన తీరు ఆకట్టుకుంటుంది. హైపర్ ఆదిని చూస్తే జబర్ధస్త్ షో గుర్తుకొస్తుంది. అచ్చం సేమ్ టూ సేమ్ అవే డైలాగ్స్.. అదే నటనను కూడా వెండితెరపై చూపించాడు. కొత్తగా చేసింది ఏమీ లేదు. పాత్రలు తక్కువగా ఉండటం.. చిన్న పాయింట్ ఆధారంగా కథనం నడిపించిన విధానం కొత్తగా ఉంటుంది. అయితే ఇది కచ్చితంగా రొటీన్ గా అయితే ఉండదు. వైవిధ్యం కోరకునేవారికి.. ఎమోషనల్స్ ఫీల్ అయ్యే వారికి మాత్రమే ఈ పాత్రలు కనెక్ట్ అవుతాయి. అక్కడి వరకు దర్శకుడు చంద్ర సిద్ధార్ధ సెక్సెస్ అయినట్లే.

ఎమోషన్ డైలాగ్స్ :

చంద్ర సిద్దార్ధ అంటేనే ఎమోషన్స్.. గత సినిమాలు చూసిన వారికి ఇది స్పష్టం అవుతుంది. చావు విముక్తి.. బతుకు తృప్తి, క్షమాపణ అడిగిన వాడే ధైర్యవంతుడు.. క్షమించిన వాడే బలవంతుడు అనే బరువైన డైలాగ్స్ ఉన్నాయి. మామూలు మనుషులు ఎలా ఉంటారు.. వారి భావోద్వేగాలు ఎలా ఉంటాయి.. వారి మనస్తత్వం ఎలా ఉంటుంది.. వారి ఆలోచనలు వాస్తవ జీవితానికి ఎలా భిన్నంగా ఉంటాయో చూపించిన విధానం బాగుంది. చావు బతుకుల మధ్య పోరాటం ఎలా ఉంటుందో తెరకెక్కించిన విధానం ఆసక్తికరంగా ఉంటుంది. టైటిల్ సాంగ్ ఎట్టాగయ్యా శివ అనే పాట బాగా కనెక్ట్ అవుతుంది. సంగీతం కూడా కథ, కథనానికి తగ్గట్టుగానే ఉంటుంది. రీమేక్ మూవీ కావటంతో.. కన్నడ నటులు కొంచెం ఎక్కువగా కనిపిస్తారు. సంగీతం కూడా బరువుగానే ఉంటుంది.

ఉరిశిక్ష పడిన ఖైదీ బాబ్జీ పాత్రను పూర్తిగా చూపించకపోవటంతో కొంత గందరగోళానికి గురవుతాడు ప్రేక్షకుడు. బాబ్జీ పలికించిన భావోద్వేగానికి కారణాలు ఏంటో.. ప్రేక్షకుడికి అర్థం కాదు. ఉరిశిక్షకు చూపించిన కారణాలు కూడా బలహీనంగా ఉన్నాయి. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉన్నా.. అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా లేదు. భావోద్వేగాలు, వైవిధ్యం కోరుకునే వారికి మాత్రమే నచ్చే సినిమా ఇది.

Latest Updates