రివ్యూ : ఆర్.ఎక్స్ 100

రన్ టైమ్ : 2 గంటల 30 నిమిషాలు

నటీనటులు : కార్తికేయ, పాయల్ రాజ్ పుత్, రావు రమేష్, రాంకీ ఇతరులు

సినిమాటోగ్రఫీ : రామ్

మ్యూజిక్ : చైతన్ భరద్వాజ్

నిర్మాత : అశోక్ కుమార్ గుమ్మకొండ

రచన, దర్శకత్వం : అజయ్ భూపతి

రిలీజ్ డేట్ : జూలై 12, 2018

కథేంటి?

తల్లితండ్రులు లేని శివ (కార్తికేయ)ను డాడీ (రాంకీ) చేరదీస్తాడు. వీళిద్దరూ ఊరి పెద్ద అయిన విశ్వనాథం (రావు రమేష్) దగ్గర నమ్మిన బంట్లు. రావు రమేష్ జనాలకు అన్యాయం చేస్తున్నాడని గొడవ పెట్టుకుంటారు. అదే సమయంలో విశ్వనాథం కూతురు ఇందు (పాయల్ రాజ్ పుత్) ఊరొస్తుంది. మొదటి చూపులోనే శివను చూసి ప్రేమిస్తుంది. శివ కూడా ఆమె ప్రేమలో పీకల్లోతు మునిగిపోతాడు.ఇ ది ఇష్టంలేని విశ్వనాథం.. శివను కొట్టించి కూతురికి వేరే పెళ్లి చేసి పంపించేస్తాడు. శివ మాత్రం తనను మర్చిపోలేక తాగుడుకు బానిసవుతాడు. మూడేళ్ల తర్వాత ఊరొచ్చిన ఇందు శివను చూసి షాకవుతుంది. ఆ తర్వాత ఏమైంది. వాళిద్దరూ కలిసారా లేదా అనేది సస్పెన్స్.

నటీ నటుల పర్ఫార్మెన్స్:

మొదటి సినిమాతో పోలిస్తే హీరో కార్తికేయ నటనలో ఇంప్రూవ్ అయ్యాడు. సినిమాలో తనకు నటించే స్కోప్ దొరికింది. సిక్స్ ప్యాక్ పెంచి మాస్ హీరోగా కనిపించాడు. క్లైమాక్స్ లో కూడా మంచి ఎమోషన్ పండించాడు. ఇక హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ బోల్డ్ గా నటించింది. కొన్నిసార్లు ఓవర్ ది బోర్ట్ వెళ్లినట్లు అనిపించినా.. ఇలాంటి రోల్ చేయడానకి గట్స్ ఉండాలి. హాట్ సీన్లల్లో బెరుకు లేకుండా నటించింది. ఇక రావు రమేష్ ఒకట్రెండు సీన్లల్లో తన మార్కు చూపించాడు. రాంకీ కొన్ని సీన్లలో అవసరానికి మించి నటించి విసింగించాడు.

సాంకేతిక వర్గం:

రామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇలాంటి సినిమాకు తగినట్టు నేచురల్ గా తీశాడు. పాటల్లో గోదావరి లొకేషన్లను బాగా క్యాప్చర్ చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ ఇచ్చిన పాటల్లో రెండు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కొన్నిసీన్లల్లో డామినేట్ చేసినా.. ఓవరాల్ గా బాగా చేశాడు. ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూయ్స్  బాగున్నాయి. అజయ్ భూపతి రాసుకున్న డైలాగులు కొన్ని ఎఫెక్టివ్ గా ఉన్నాయి.

విశ్లేషణ:

‘ఆర్ ఎక్స్ 100’ బోల్డ్ యూత్ ఫుల్ లవ్ స్టోరి. నిజంగా జరిగిన స్టోరీ ఆధారంగా వర్మ శిష్యుడైన అజయ్ భూపతి రియలిస్టిక్ గా తెరకెక్కించాడు. సెకండాఫ్ లో ఉన్న ట్విస్ట్, క్లైమాక్స్ మాత్రమే ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్ అంతా భరించాల్సి వస్తుంది. చివరి 30 నిమిషాల్లో ఉన్న ఇంటెన్స్ ఫస్టాఫ్ లో మిస్ అయ్యింది. ఫస్టాఫ్ లో విషయం లేదు కాబట్టి హాట్ సీన్లు, పాటలతో నింపేసాడు. స్క్రీన్ ప్లే సరిగా లేకపోవడంతో ఆ రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఫోర్స్ డ్ గా ఉన్నాయి. బాగా రాసుకుంటే ప్రథమార్థం లో కూడా మెరుపులు మెరిపించేందుకు స్కోప్ ఉన్న కథ ఇది. డైరెక్టర్ అజయ్ భూపతి ఎంత సేపు యూత్ ఆడియన్స్ ను టార్గెట్ చేసినట్టే కనిపించింది. ఈ విషయంలో ‘అర్జున్ రెడ్డి’ ని ఫాలో అయినట్టు కనిపిస్తుంది. అందులో ప్రేమ ఉంది. ఎమోషన్ ఉంది. కానీ ‘ఆర్.ఎక్స్ 100’ లో ప్రేమను కామం డామినేట్ చేస్తుంది. దానివల్ల ఎమోషన్ మిస్ అయింది. ఇక హీరోను కొట్టే సీన్లల్లో అయితే రక్తపాతం మరీ శృతిమించింది. వర్మ శిష్యుడు అంటే ఆయనలాగే ఉండాల్సిన అవసరం లేదు.

చివరి 30నిమిషాలు బాగా నడిపించాడు డైరెక్టర్. ట్విస్ట్ రివీల్ చేసిన తీరు, దాన్ని చివరి వరకు నడిపించిన స్టైల్ ఇంప్రెస్ చేస్తుంది. మేకింగ్, రియలిస్టిక్ అప్రోచ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టిన డైరెక్టర్ స్క్రీన్ ప్లే విషయంలో కూడా పెట్టి ఉంటే సినిమా ఇంకా బాగుండేది. బీ, సీ సెంటర్లలో యూత్ ఆడియన్స్ కు నచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నా మేజర్ ఆడియన్స్ వరకు పెదవి విరుస్తారు.

బాటమ్ లైన్ : సౌండ్ ఎక్కువ.. మైలేజ్ తక్కువ

Posted in Uncategorized

Latest Updates