రివ్యూ : కవచం

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో, వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై నవీన్ శొంఠినేని నిర్మించిన సినిమా ‘కవచం’. కాజల్, మెహ్రీన్ హీరోయిన్లు. పోలీస్ ఆఫీసర్ బ్యాక్ డ్రాప్‌ లో యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎంతవరకు థ్రిల్ చేసిందో చూద్దాం.

కథేంటి …
విశాఖపట్నంలో ఎస్సైగా పనిచేస్తోన్న విజయ్ (శ్రీనివాస్)కి ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అవ్వాలన్నది కల. అప్పటికే నగరంలో ఆడపిల్లల కిడ్నాప్ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తుంటారు. ఈ సమయంలో సంయుక్త (మెహ్రీన్) ప్రియుడి కోసం ఇంట్లోంచి పారిపోయి వచ్చి రౌడీల బారిన పడుతుంది. ఆమెను కాపాడి, ఒకరోజు ఆశ్రయం ఇచ్చి, వాళ్ళింటికి పంపించడానికి బస్టాప్‌‌‌‌కి వెళతాడు విజయ్. అదే సమయంలో అతని తల్లికి యాక్సిడెంటవుతుంది. ఆపరేషన్‌‌‌‌కి యాభై లక్షలు కావాల్సి వస్తుంది. ఏం చెయ్యాలో తెలీని పరిస్థితిలో ఉన్న విజయ్‌‌‌‌తో… తనని కిడ్నాప్ చేశానని చెప్పి తమవాళ్లని డబ్బులు అడగమని చెప్తుంది సంయుక్త. తప్పనిసరి పరిస్థితుల్లో కిడ్నాప్ డ్రామా ప్లే చేసి తల్లికి ఆపరేషన్ చేయిస్తాడు విజయ్. సంయుక్తని ఇంట్లో అప్పజెప్పే క్రమంలో ఆమెనొకచోట దించి వెళ్ళి పోతాడు. కానీ సంయుక్తని కిడ్నాపర్ డబ్బులు తీసుకుని కూడా వదల్లేదని, ఆ కిడ్నాపర్ ఎస్సై విజయ్ అని న్యూస్ వస్తుంది. విజయ్‌‌‌‌ని పట్టుకోవడానికి ఏసీపీ శరత్ చంద్ర ( హరీష్ ఉత్తమన్) రంగంలోకి దిగుతాడు. పోలీసుల నుంచి తప్పించుకుని, తనపై పడ్డ ఆరోపణలు నిజం కాదని నిరూపించుకునే క్రమంలో సంయుక్తగా తనకు పరిచయమైంది లావణ్య అని తెలుసుకుంటాడు విజయ్. అసలు సంయుక్త కథేంటి, ఆమె ప్లేస్‌‌లోకి లావణ్య ఎందుకొచ్చింది, ఈ వ్యూహాన్ని విజయ్ ఎలా ఛేదించాడనేది మిగతాకథ.

విశ్లేషణ
యాక్షన్ డ్రామాగా మొదలైన సినిమా థ్రిల్లర్ జానర్‌‌‌‌లోకి మారుతుంది. ప్రేక్షకులకూ థ్రిల్ స్టార్టవుతుంది . ఇక సెకెండాఫ్‌‌‌‌లో అసలేం జరిగిందనే ట్విస్టులతో ఆస్తకికరంగానే ఉంటుంది . కానీ ఆ ఉత్కంఠని ఎక్కువసేపు మెయింటెయిన్ చేయలేని కథనంతో మెల్లగా ఆసక్తి తగ్గిపోతుంది. తల్లిని పట్టుకెళ్లి హీరోయిన్ని అప్పజెప్పమనడం, భారీ బిల్డప్‌‌‌‌తో క్లైమాక్స్ వంటివి రొటీన్ సినిమానే తలపిస్తాయి. అయితే పోలీసాఫీసర్‌‌‌‌గా శ్రీనివాస్ కొత్తగా కనిపించాడు. హీరోయిన్లు అందంగా ఉన్నారు. పాటలు ఓకే. లొకేషన్స్ రిచ్‌ గా ఉన్నాయి. డైలాగులు కొన్ని చోట్ల పేలాయి. యాక్షన్ డ్రామాని, థ్రిల్లర్లని ఇష్టపడేవాళ్ళు వెళ్లొచ్చు.

Latest Updates