రివ్యూ: కాలా

kaala-review

రన్ టైమ్ : 2 గంటల 47 నిమిషాలు
నటీనటులు : రజినీకాంత్, నానా పటేకర్, ఈశ్వరీ భాయి, హుమా ఖురేషి, సంపత్ రాజ్, సముద్రఖని, అంజలి పాటిల్, షియాజీ షిండే తదితరులు
సినిమాటోగ్రఫీ : మురళీ.జి
మ్యూజిక్ : సంతోష్ నారాయణ
ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్
నిర్మాత : ధనుష్
రచన, దర్శకత్వం : పా.రంజిత్
రిలీజ్ డేట్ : జూన్ 7, 2018

కథేంటి?

ముంబై దారావి స్లమ్ ఏరియాకు లీడర్ కాలా (రజినీ కాంత్). తన రాజకీయ బలంతో ఆ స్థలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తాడు హరిదాస్ (నానా పటేకర్). పేదవాళ్ల తరపున పోరాడుతూ హరిదాస్ ను ఎదుర్కొంటూ వస్తాడు కాలా. ఆ క్రమంలో ఎదురైన ఇబ్బందులు ఏంటి..? చివరకు హరిదాస్ నుంచి ఆ నేలను, దారావి ప్రజలను ఎలా కాపాడాడు అనేది కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్ :

రజినీకాంత్ మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించాడు. ఇప్పటికీ అంతే ఎనర్జీ, అటిట్యూడ్ తో నటించినందుకు అభినందించి తీరాల్సింది. కబాలి కన్నా ఇందులో మాస్ సీన్లల్లో ఎక్కువగా కనిపించి అదరగొట్టాడు. విలక్షణ నటుడు నానా పటేకర్ నెగటివ్ రోల్ లో కనిపించి ఆ పాత్రకు వన్నె తెచ్చాడు. రజినీ, నానా మధ్య సీన్లు బాగా పండాయి. ఇద్దరూ పోటాపోటీగా నటించారు. ఈశ్వరీ భాయికి మంచి రోల్ దక్కింది. తన పాత్రలో ఒదిగిపోవడమే కాకుండా ఎంటర్ టైన్మెంట్ కూడా పండించింది. మరో ప్రధాన పాత్రలో ఖురేషి రాణించింది. సముద్రఖని సపోర్టింగ్ పాత్రలో చక్కగా రాణించాడు. షియాజీ షిండే, సంపత్ రాజ్, అంజలి పాటిల్ మెరిసారు. రజినీ కొడుకుల పాత్రల్లో నటించిన వాళ్లు కూడా తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు.

టెక్నీషియన్స్ వర్క్:

టెక్నికల్ గా సినిమా హై స్టాండర్డ్స్ లో ఉంది. సినిమాటోగ్రఫీ టాప్. ముఖ్యంగా రెయిన్ ఫైట్, క్లయిమాక్స్ లో కెమెరామన్ మురళీ పనితనం అద్భతం. సంతోష్ నారాయణన్ ఇచ్చిన పాటలు బాగాలేవు కానీ.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సీన్లను బాగా ఎలివేట్ చేశాడు. ఆర్ట్ వర్క్ సినిమాకు మరో హైలెట్. స్లమ్స్ లో ప్రజలు ఎలా బతుకుతారో కళ్లకు కట్టినట్టు సెట్ రూపంలో చూపించారు. ఎడిటింగ్ వర్క్ బాగున్నా.. ఫస్టాఫ్ లో కొన్ని సీన్లు కత్తెరపడాల్సింది. రంజిత్ రాసుకున్న విప్లవాత్మక డైలాగ్స్ బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

రజినీకాంత్ నటన

సినిమాటోగ్రఫీ

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

హీరో – విలన్ మధ్య సీన్లు

మైనస్ పాయింట్స్ :

స్క్రీన్ ప్లే, డైరెక్షన్

లవ్ ట్రాక్

క్లయిమాక్స్

విశ్లేషణ:

కాలా మరో కబాలి దారిలో సాగింది. ప్రేక్షకుడుకి కూడా కబాలి సినిమా గుర్తుకు రావటం విశేషం. కాకపోతే.. ఆ సినిమా కంటే బెటర్ గా తీశాడు కలాను. మాస్ మసాలా ఎక్కువగా చూపించే ప్రయత్నం చేసినా.. సెంటిమెంట్ కే ఎక్కువ ప్రయార్టీ ఇచ్చాడు డైరెక్టర్. అణగారిన వాళ్ల హక్కులు, ధనిక పేద బేధాలు, నేల కోసం పోరాటాలను చూపించాడు. అది చెప్పాలనుకున్న తీరులో మాత్రం తడబడ్డాడు. అన్నీ ఉన్నా ఎదో వెలితి అనిపిస్తుంది. అంతమంది ఆర్టిస్టులున్నా.. మంచి సీన్లకు అవకాశం ఉన్నా.. సీన్లు పండలేవు. తెరపై ఒక్కోసారి ఏం జరుగుతుందో అయోమయం. అంత పెద్ద సూపర్ స్టార్ స్క్రీన్ పై ఉన్నా.. కొన్ని విసుగు తెప్పించే సీన్లున్నాయి. రజినీ-హుమా ఖురేషి లవ్ ట్రాక్ బోర్ కొడుతుంది. ఇక ప్రీ ఇంటర్వెల్ దగ్గర మాత్రం తన పనితనం చూపించాడు డైరెక్టర్. రెయిన్ ఫైట్.. దాని తర్వాత నానా పటేకర్, రజినీ ఏరియాకు వచ్చినప్పటి ఎపిసోడ్ బాగా కుదిరాయి. ఈ సీన్ల వల్ల సెకండాఫ్ పై హోప్ పెరుగుతుంది. అయినా.. సెకండాఫ్ లో ప్రేక్షకులు ఊహించినంతగా మెరుపులు లేకపోవటం విశేషం. రజినీ.. నానా పటేకర్ ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చే సీన్ తప్ప.. సెకండాఫ్ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. ఇక క్లైమాక్స్ లో గందరగోళానికి గురి చేశాడు రంజిత్. రజినీకాంత్ స్టయిల్, యాక్షన్ సీన్లు, హీరో విలన్ మధ్య సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్స్ కాగా.. స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రధాన లోపాలు. ఫ్యాన్స్ వరకు ఓకే అనిపించినా.. ఓవరాల్ గా మాత్రం కాలా అలా అలా నడుస్తోంది.

బాటమ్ లైన్ : కబాలి కన్నా బెటరే కానీ..

Posted in Uncategorized

Latest Updates