రివ్యూ : చినబాబు

రన్ టైమ్: 2 గంటల 27 నిమిషాలు

నటీనటులు : కార్తీ, సయేషా, సత్యరాజు, సూరి, శత్రు, భానుప్రియ ఇతరులు

సినిమాటోగ్రఫీ : వేల్ రాజ్

మ్యూజిక్ : ఇమాన్

నిర్మాతలు : సూర్య శివకుమార్, మిరియాల రవీందర్ రెడ్డి

రచన, దర్శకత్వం : పాండిరాజ్

రిలీజ్ డేట్ : జూలై 13, 2018

కథేంటి?

మగ సంతానం కావాలనుకునే రుద్రరాజు (సత్యరాజు)కి ఐదుగురు ఆడపిల్లల తర్వాత చినబాబు (కార్తీ ) పుడతాడు. రైతుగా ఊళ్లోనే ఉంటూ అక్కల భాధ్యతలు చూసుకుంటాడు. అక్కల కూతుళ్లు ఇద్దరు మాత్రం చినబాబును పెళ్లి చేసుకోవాలని ఇష్టపడతారు. చినబాబు అదే ఊళ్లో ఉండే నీరద (సయేషా)ను ప్రేమిస్తాడు. ఆ సంబంధం ఇష్టం లేని అక్కలు గొడవ పెట్టుకుంటారు. కలిసి, మెలిసి ఉండే వాళ్ల మధ్య మనస్పర్దలొస్తాయి. ఇదే టైమ్ లో నీల నీరద మేనబావ సురేంద్ర రాజు (శత్రు)కు చినబాబుకు పడదు. శతృత్వం పెంచుకున్న సురేంద్ర.. చినబాబు ఫ్యామిలీలో ఎలాంటి తగాదాలు పెట్టాడు అనేది కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్ :

హీరో కార్తీ రైతుగా నటించి తన పాత్రకు 100 శాతం న్యాయం చేశాడు. ఓ ఫ్యామిలీ మెంబర్ గా అక్కల బాధ్యతలు చూసే తమ్ముడిగా మంచి నటన కనబరిచాడు. క్లైమాక్స్ లో ఎమోషనల్ గా నటించి కంటతడి పెట్టించాడు. తన పాత్రకు అందరు తమ్ముళ్లు కనెక్ట్ అవుతారు. హీరోయిన్ సయేషా పల్లెటూరి అమ్మాయిగా సూట్ అవలేదు. నటన కూడా అంతంత మాత్రమే. సత్యరాజ్ కు తెలుగు డబ్బింగ్ బాల సుబ్రహ్మణ్యం గారితో చెప్పించారు. అది సూట్ అవలేదు. విలన్ గా నటించిన శత్రు మంచి పర్ఫార్మెన్స్ కనబరిచాడు. ఆ రోల్ కు పర్ఫెక్ట్ గా సరిపోయాడు. భానుప్రియ కు సరైన పాత్ర దక్కలేదు. కమెడియన్ సూరి తన టైమింగ్ తో నవ్వులు పూయించాడు.

సాంకేతిక వర్గం:

వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి అందాలు బాగా చూపించాడు. ఇమాన్ ఇచ్చిన పాటల్లో రెండు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ ను క్యారీ చేసింది. ఎడిటింగ్ ఇంకా క్రిస్ప్ గా ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ ను పర్ఫెక్ట్ గా చూపించాడు ఆర్ట్ డైరెక్టర్. కామెడీ పంచ్ లు బాగా పేలాయి.

విశ్లేషణ :

‘చినబాబు’ సరదాగా సాగిపోయే ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇప్పటివరకు ఇలాంటివి ఎన్నో చూసినవే అయినా డైరెక్టర్ పాండిరాజ్ ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ ని సరిగా డీల్ చేశాడు. అక్కలు – తమ్ముడి మధ్య సెంటిమెంట్ ను బాగా డీల్ చేశాడు. తమిళ వాసన ఎక్కువ కొడుతుంది. అక్కల క్యారెక్టర్ లు చేసిన వారు మరీ ఓవర్ గా ఉన్నారు. తెలుగు ఆడియన్స్ కు అంత మాస్ అప్పీల్ రుచించడం కష్టమే. ఫస్టాఫ్ లో ఎలాంటి మెరుపులు లేని ‘చినబాబు’ సెకండాఫ్ లో మాత్రం కామెడీ, ఎమోషన్స్ తో ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్ లో టెంపుల్ సీన్ కు అందరూ కనెక్ట్ అవుతారు. కథలో కొత్తదనం లేకపోవడం, హీరో విలన్ల మధ్య కాన్ ఫ్లిక్ట్ సరిగా లేకపోవడం సినిమాకు మైనస్. కథ కొత్తది కాకపోయినా.. ట్రీట్ మెంట్ అయినా కొత్తగా ఉండాల్సింది. డైరెక్టర్ పెద్దగా కష్టపడకుండా 80 దశకం నుంచి వస్తున్న కథనే మళ్లీ చూపించాడు. కార్తీ పర్ఫార్మెన్స్, సూరి కామెడీ, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అంశాలుండడం వల్ల సినిమా పాసైపోతుంది. కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కు నచ్చకపోయినా.. బీ, సీ సెంటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సెంటిమెంట్ ను రిలేట్ చేసుకునే అవకాశముంది.

బాటమ్ లైన్ : టైంపాస్ ఫ్యామిలీ డ్రామా

Posted in Uncategorized

Latest Updates