రివ్యూ : చి.ల.సౌ

రన్ టైమ్: 2 గంటల 15 నిమిషాలు
నటీనటులు : సుశాంత్, రుహాని శర్మ, రోహిణి, వెన్నెల కిషోర్, విద్యు లేఖ, రాహుల్ రామకృష్ణ తదితరులు
సినిమాటోగ్రఫీ : సుకుమార్
మ్యూజిక్ : ప్రశాంత్.ఆర్.విహారి
నిర్మాతలు : సిరుని క్రియేషన్స్,అన్నపూర్ణ స్టూడియోస్
రచన, దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్
రిలీజ్ డేట్ : ఆగస్ట్ 3,2018
కథేంటి?
అర్జున్ (సుశాంత్) కు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉండదు. పెళ్లంటే ఓ భారం అనుకుంటూ ఉంటాడు. కానీ వాళ్ల పేరెంట్స్ మాత్రం పెళ్లి చేసుకోమని బలవంతం పెడతారు. ఓ రోజు అలానే అంజలి (రుహాని) అనే అమ్మాయిని వాళ్ల ఇంట్లోనే అర్జున్ తో డేట్ కు ఫిక్స్ చేస్తారు. అంజలి కి కూడా పెళ్లి అన్నా, అబ్బాయిలన్నా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కానీ వాళ్ల అమ్మ హెల్త్ ప్రాబ్లం వల్ల ఒప్పుకోవాల్సి వస్తుంది. వాళ్లు ఇద్దరే కలుసుకున్నప్పుడు ఏం జరుగుతుంది.పెళ్లి మీద ఇద్దరి అభిప్రాయాలు మారతాయా?వాళ్లు ఒకటయ్యారా లేదా అనేది మిగతా సినిమా.
నటీనటుల పర్ఫార్మెన్స్ :
ఐదారు సినిమాలో చేసినా.. నటుడిగా పెద్దగా గుర్తింపు తెచ్చుకోని సుశాంత్ ‘‘చి ల సౌ’’ ద్వారా తనకు సూటయ్యే రోల్ ఎంచుకున్నాడు. నటనలో ఫర్వాలేదనిపించాడు. రుహానీ శర్మ లుక్స్ పరంగా యావరేజ్ కానీ.. పర్ఫార్మెన్స్ బాగుంది. కొన్నిసార్లు ఓవర్ ది బోర్డ్ వెళ్లి విసిగించింది. వెన్నెల కిషోర్ ఎంటర్ టైన్మెంట్ కు బాగా పనికొచ్చాడు. తన కామెడీ టైమింగ్ తో ప్రీ క్లైమాక్స్ లో బాగా నవ్వించాడు. రోహిణి పాత్ర తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఆ క్యారెక్టర్ లో ఆవిడ ఒదిగిపోయి నటించింది. జయప్రకాష్, విద్యులేఖ ఫర్వాలేదనిపించారు.
టెక్నికల్ వర్క్ :
సుకుమార్ సినిమాటోగ్రఫీ యావరేజ్ గా ఉంది. ఎక్కువ క్లోజప్ షాట్ లతో ఇబ్బంది పెట్టాడు. ప్రశాంత్, ఆర్.విహారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. లవ్, ఎమోషనల్ సీన్లు బాగా పండటానికి తన నేపథ్య సంగీతం బాగా పనికొచ్చింది. చాలా తక్కువ బడ్జెట్ లో తీశారు కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ గొప్పగా ఏం లేవు. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. రాహుల్ రవీంద్రన్ రాసుకున్న సంభాషణలు బాగున్నాయి.
విశ్లేషణ :
‘‘చిలసౌ’’ రొటీన్ గా సాగే ఓ క్లాస్ ఎంటర్ టైనర్. మల్టీప్లెక్స్ ఆడియన్స్ వరకు ఓకే కావచ్చు కానీ సామాన్య ప్రేక్షకుడి చూడాలనకుంటే మాత్రం చాలా ఓపిక కావాలి. ఈ సినిమా తో దర్శకుడిగా మారిన హీరో రాహుల్ రవీంద్రన్ మొదటి ప్రయత్నం తో కొంత వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. రైటర్ గా మంచి ప్రతిభ కనబరిచిన రాహుల్.. దాన్ని బోర్ కొట్టకుండా తెరకెక్కించడంలో తడబడ్డాడు. హీరోయిన్ మదర్ క్యారెక్టరే ఈ సినిమాకు మెయిన్ కాన్ ఫ్లిక్ట్ అయినపుడు దాన్ని వీలైనంత తొందరగా ఇంట్రడ్యూస్ చేసేయ్యాలి. దానికి 30 నిమిషాలు తీసుకున్నాడు. దానికి ముందు అంతా అవసరం లేని సీన్లతో విసిగించాడు. రోహిణి క్యారెక్టర్ తో చలనం వస్తుంది. ఇంటర్వెల్ వరకు ఫర్వాలేదనిపిస్తుంది. సెకండాఫ్ మొదలైయ్యాక మళ్లీ అదే పద్దతి. హీరోయిన్ పాత్ర రాసుకున్న విధానం బాగానే ఉన్నా.. హీరో తో తను బిహేవ్ చేసే పద్దతి చాలా ఆర్టిఫీషియల్ గా అనిపిస్తుంది. తనను పెళ్లి చేసుకోమని లిటరెల్ గా బ్లాక్ మెయిల్ చేసినట్టుగా ఉంటుంది. హీరోపై పెత్తనం చలాయిస్తూ.. తన లవర్ లాగా కోపం ప్రదర్శిస్తుంటుంది. ఇవన్నీ విసుగుపుట్టిస్తాయి. ఇదంతా ఒక రోజులో జరిగే కథ కానీ.. స్లో నరేషన్ వల్ల చాలా టైమ్ అయిపోయిన ఫీల్ కలుగుతుంది. రాసుకున్న విధానం, కొన్ని సీన్లు, ప్రీ క్లైమాక్స్ లో వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాను సేవ్ చేసాయని చెప్పాలి. ఫీల్ గుడ్ సినిమాలు ఇష్టపడే వారికి ఓ సారికి ఓకే కానీ.. సగటు ప్రేక్షకుడికి మాత్రం సహన పరీక్షే.
బాటమ్ లైన్: చి..ల్యాగ్.. సౌ

Latest Updates