రివ్యూ : దైవ రహస్యం.. ఈ సుబ్రహ్మణ్యపురం

‘మళ్లీరావా’ వంటి లవ్‌స్టోరీ తర్వాత తనకు వరుస ప్రేమకథా చిత్రాలు వస్తాయనుకున్నాడు సుమంత్‌. కానీ విచిత్రంగా థ్రిల్లర్‌ సినిమా వచ్చింది. అదే ‘సుబ్రహ్మణ్యపురం’. ఈమధ్యకాలంలో టైటిల్‌ అండ్‌ ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన సినిమాల్లో ఇదీ ఒకటి. ఎన్నికలరోజున విడుదలైనప్పటికీ జనం థియేటర్స్‌కు వెళ్లారంటే ఆ టైటిలే కారణం. కొత్త దర్శకుడు సంతోష్ జాగర్లపూడి రూపొందించిన ఈ సినిమా టైటిల్‌కు తగ్గట్టు మెప్పించిందో లేదో చూద్దాం.

కథ ఏమిటంటే..?

సుబ్రహ్మణ్యపురంలో ఓ పురాతన దేవాలయం. అందులో గల సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకం నిషిద్ధం. కానీ తాగిన మైకంలో ఒకరు అభిషేకం చేస్తారు. అది మొదలు ఆ ఊరిలో వరుస ఆత్మహత్యలు జరుగుతుంటాయి. చనిపోయిన ప్రతివారికి ఓ బంగారు నెమలి కనిపిస్తుంది. అది కనిపించిన కొద్ది క్షణాలకు పక్కన ఉన్నవారికి ఓ ఉత్తరం ఇచ్చి వారు ఆత్మహత్య చేసుకుంటుంటారు. ఆ ఉత్తరం గాంధార లిపిలో ఉంటుంది. తనకు ఇష్టంలేని అభిషేకం చేయడం వల్లే ఆగ్రహించిన సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇదంతా చేస్తున్నాడని జనం విశ్వసిస్తారు. విషయం బయటకు పొక్కితే దేవాలయానికి చెడ్డపేరు వస్తుందని జాగ్రత్తపడుతుంటారు ఆ ఊరి పెద్ద నరేంద్రవర్మ (సురేశ్‌).  దేవుడంటే నమ్మకం లేకున్నా పురాతన దేవాలయాలపై రీసెర్చ్‌ చేసే కార్తీక్‌ (సుమంత్‌)ను ఈ దేవాలయం, అక్కడ జరిగిన సూసైడ్స్ గురించి తెలుస్తుంది.  కార్తీక్‌ ఈ ఆత్మహత్యలపై పరిశోధన మొదలెడతాడు. ఆత్మహత్యలకు భయపడి ఆ జనం ఆ ఊరు వదలి వెళ్లేందుకు సిద్ధమవుతారు. పదిరోజుల్లో ఆ గుట్టు తెల్చేస్తానని ఛాలెంజ్‌ చేస్తాడు కార్తీక్‌. ఆ తర్వాత అతనికి రకరకాల అనుభవాలు ఎదురౌతాయి. అవేంటి, ఆ పరిశోధనలో అతను కనుగొన్నదేంటి. దేవుడి ఆగ్రహం వల్లే ఇదంతా జరిగిందా వంటి అంశాలు తెరపైనే చూడాలి.

ఎవరెట్లా..?

థ్రిల్లర్స్‌ తనకు కొత్త అంటూనే కార్తీక్‌ పాత్రలో  సెటిల్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు సుమంత్‌. ఈషారెబ్బా నటన ఆకట్టుకుంది. సురేష్‌కు ప్రాధాన్యత కల పాత్ర లభించింది. జోష్ రవి, భద్రమ్, హర్షిణి, అమిత్ తమ పాత్రల పరిధిమేరకు నటించారు. శేఖర్‌చంద్ర సంగీతంలో ‘ఈ రోజు ఇలా’ అనే పాట ఆకట్టుకుంది. నేపథ్య సంగీతం థ్రిల్లర్‌ మూడ్ క్రియేట్‌ చేస్తూ సినిమాకు ప్లస్ అయింది. ఆర్.కె.ప్రతాప్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఎడిటింగ్ విషయంలో కార్తీక్ శ్రీనివాస్ ఇంకొంత కత్తెరకు పని చెప్పాల్సిన అవసరముంది.

ఎలా ఉందంటే..?

రానా గంభీరమైన వాయిస్‌ ఓవర్‌తో సినిమా మొదలవడంతో కథపై ఇంట్రస్ట్ క్రియేట్‌ అయింది. ట్రైలర్‌లో చెప్పినట్టు  దేవుడికి, మనిషి మేథస్సుకి మధ్య జరిగిన కథ ఇది. పురాతన ఆలయాల వెనుక కొన్ని సైంటిఫిక్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. సరిగ్గా అదే అంశాన్ని ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్నాడు దర్శకుడు సంతోష్. అనుగ్రహించాల్సిన దేవుడు ఆగ్రహించాడంటే భక్తులు నమ్మొచ్చు. కానీ దేవుడుపై నమ్మకం లేని వ్యక్తి నమ్మడు. బహుశా అందుకేనేమో హీరో క్యారెక్టర్‌ను నాస్తికుడిగా ఎంచుకున్నారు. అయితే ఫస్ట్ హాప్‌లో ఎక్కువగా సూసైడ్స్‌ మరియు లవ్‌స్టోరీపై దృష్టిపెట్టడంతో కథనం కొంత నెమ్మదించింది. సెకండాఫ్‌లో దాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేశారు. కథలో ప్రధానమైన ట్విస్ట్ అంతా క్లైమాక్స్‌లోనే ఉంది. అందుకే క్లైమాక్స్‌ థ్రిల్‌ చేస్తుంది. అయితే థ్రిల్లింగ్‌ చిత్రాలకు అవసరైన ఉత్కంఠ సినిమా అంతటా కంటిన్యూ కాలేకపోయింది. ఏదేమైనా పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా సరదాగా ఓసారి చూసి ఎంజాయ్‌ చేయొచ్చు.

 

Latest Updates