రివ్యూ: నేల టిక్కెట్

nela-ticket-reviewరన్ టైమ్: 2 గంటల 47 నిమిషాలు

నటీనటులు: రవితేజ, మాళవిక శర్మ, జగపతిబాబు,శరత్ కుమార్, అలీ, ప్రియదర్శి, పోసాని, బ్రహ్మాజి, సంపత్ రాజ్, తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరాం, శివాజీ రాజా తదితరులు

స్క్రీన్ ప్లే: సత్యానంద్

సినిమాటోగ్రఫీ: ముఖేష్.జి

మ్యూజిక్: శక్తి కాంత్ కార్తీక్

నిర్మాత: రామ్ తాళ్లూరి

కథ,మాటలు,దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ కురసాల

రిలీజ్ డేట్: మే 25, 2018

కథేంటి?

అనాథగా పెరిగిన రవితేజకు ఎప్పుడూ చుట్టూ జనం అందులో మనం ఉండాలనుకుంటాడు. అతన్నీ, అతని చెల్లెల్నీ చేరదీసిన ఆనంద భూపతిని (శరత్ కుమార్) రాజకీయ లబ్ది కోసం చంపుతాడు ఆదిత్య భూపతి (జగపతి బాబు). ఆ సాక్ష్యాన్ని సంపాదించిన తన చెల్లల్నీ చంపే ప్రయత్నం చేస్తారు. మినిస్టర్ అయి అరాచకాలు చేస్తున్న ఆదిత్య నుంచి ప్రజలను, తన చెల్లిని హీరో ఎలా కాపాడుకున్నాడు అనేది కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

తన ఎనర్జీతో ప్రతి సినిమాలో మాగ్జిమమ్ ఎంటర్ టైన్మెంట్ పండించే రవితేజ ఇందులో కూడా తన శాయశక్తులా ప్రయత్నించాడు. కథ, కథనాలు బలహీనంగా ఉండటంతో.. ఆయన కూడా కాపాడలేకపోయాడు. హీరోయిన్ మాళవిక శర్మ రవితేజకు జోడీగా సూటవ్వలేదు. తన పర్ఫార్మెన్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. జగపతిబాబు టిపికల్ విలన్ క్యారెక్టర్ లో తన వంతు ప్రయత్నం చేశాడు. శరత్ బాబు, సంపత్ రాజ్, ఎల్బీ శ్రీరాం, శివాజీ రాజా, తనికెళ్ల భరణి తదితరులు తమకు అలవాటైన పాత్రల్లో నటించారు. కామెడీ కోసం అలీ, ప్రియదర్శి, పృధ్వీ, ప్రవీణ్, పోసాని, రఘుబాబులతో చేయించిన ప్రయత్నాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.

టెక్నీకల్ వర్క్ :

ముఖేష్ సినిమాటోగ్రఫీ ఒక్కటే సినిమాలో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్. చేజింగ్ సీన్లో, మిగతా యాక్షన్ సీన్లల్లో తన పనితనం మెప్పిస్తుంది. శక్తి కాంత్ కార్తీక్ మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తోంది. ‘ఫిదా’ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఈయనేనా అనే డౌట్ వస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే రణగొణ ధ్వనులతో బెంబేలెత్తిస్తుంది. ఎడిటింగ్ లో చాలా సీన్లను లేపెయ్యాల్సింది. లెంగ్త్ ఎక్కువైంది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను భారీ గా తీశారు. మాటలతో ఫర్వాలేదనిపించిన కళ్యాణ్ కృష్ణ డైరెక్టర్ గా ఫెయిలయ్యాడు.

విశ్లేషణ:

‘నేల టిక్కెట్’ రొటీన్ కమర్షియల్ సినిమా. కథ రెగ్యులర్ అయినా.. ట్రీట్ మెంట్ కొత్తగా ఉంటే ఎంటర్ టైన్ చేయవచ్చని కొన్ని సినిమాలు నిరూపించాయి. ఇక్కడ కథ, కథనం, డైరెక్షన్ అంతా పాత చింతకాయను తలపించడంతో ‘నేల టిక్కెట్’ ఎంటర్ టైన్ చేయకపోయింది. సినిమా మొదలైనప్పటి నుంచి ఏ కోశాన ఎగ్జైట్ చేయదు. అవే రొటీన్ కామెడీ సీన్లు, అదే రొటీన్ లవ్ ట్రాక్, అదే రొటీన్ రివేంజ్ బ్యాక్ డ్రాప్.. వెరసి టార్గెట్ ఆడియన్స్ ను కూడా సహనానికి గురి చేస్తుంది. ఈ రొటీన్ కలగూరగంపలో డైరెక్టర్ తీసుకున్న సినిమాటిక్ లిబర్టీకి నేల టిక్కెట్టు ప్రేక్షకుడు కూడా ముక్కున వేలేసుకుంటాడు. ట్రైన్ యాక్సిడెంట్ అయిన మనిషి ని ఏదో బైక్ యాక్సిడెంట్ అయిన మనిషిలా చూపించడం, ఆ యాక్సిడెంట్ లో పసిపాప బతికి బయటపడటం.. రైల్వే స్టేషన్ లో అందరి ముందు ఎన్ కౌంటర్ జరిగితే అది మీడియాలో రాకుండా చూడటం.. ఇలాంటి కనీస లాజిక్ లేని సీన్లు కోకొల్లలు. తన రెండు సినిమాలూ రొటీనే అయినా.. రైటర్ గా, డైరెక్టర్ గా రాణించిన కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాతో పూర్తిగా నిరాశపరిచాడు. తలా తోక లేని కథతో ఇంత పెద్ద సినిమా ఎలా తీయాలనుకున్నాడో ఆయనకే తెలియాలి. దీనికి తోడు సత్యానంద్ స్క్రీన్ ప్లే కూడా నాసిరకంగా ఉండటంతో ఎక్కడా ఎంగేజ్ చేయలేకపోయింది. సినిమాను తన భూజాలపై మెయడానికి ప్రయత్నించిన రవితేజ కూడా ‘నేల టిక్కెట్టు’ ను కాపాడలేకపోయాడు..

Posted in Uncategorized

Latest Updates